Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తమకు సహకరించిన వారి పేర్ల జాబితాను తాలిబన్లకు ఇచ్చిన అమెరికా సైన్యం: మండిపడుతున్న యూఎస్ నేతలు!

తమకు సహకరించిన వారి పేర్ల జాబితాను తాలిబన్లకు ఇచ్చిన అమెరికా సైన్యం: మండిపడుతున్న యూఎస్ నేతలు
-కాబూల్ ఎయిర్‌పోర్టుకు వచ్చే మార్గంలో తాలిబన్ల చెక్‌పోస్టులు
-అక్కడ త్వరగా అనుమతి కోసమే తాలిబన్ల చేతికి ఈ జాబితా
-క్రూరులైన తాలిబన్లకు ఎలా ఇస్తారంటూ అమెరికన్ నేతల మండిపాటు
-విమానాశ్రయం సమీపంలో బాంబు దాడులతో ఆందోళన

తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి విదేశీ పౌరులను, పరాయి దేశాలకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆఫ్ఘన్లను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా చేసిన ఒక షాకింగ్ చర్య అందరిలో ఆందోళన నింపుతోంది.

కాబూల్ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు వివిధ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చెక్‌పోస్టుల నుంచి తమ పౌరులు త్వరగా వచ్చేలా వీలు కల్పించడం కోసమే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందట. అమెరికా పౌరులు, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వాళ్లు, తమకు గతంలో సహకరించిన ఆఫ్ఘన్ల వివరాలున్న జాబితాను ఇక్కడి అమెరికన్ అధికారులు తాలిబన్లకు ఇచ్చారట. వీరు విమానాశ్రయం వద్దకు వచ్చే సమయంలో ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతోనే అమెరికా అధికారులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ నిర్ణయాన్ని పలువురు అమెరికా నేతలు, మిలటరీ ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారు. తాలిబన్లు ఎంత క్రూరులో గతంలో చూశామని, అలాంటి వారికి ఇలాంటి జాబితా ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల చేతిలో ఈ జాబితా ఒక ‘కిల్ లిస్ట్’గా మారుతుందని, జాబితాలోని వారిని తాలిబన్లు చంపేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కాబూల్ విమానాశ్రయంపై జరిగిన బాంబు దాడులు ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా మృత్యువాత పడగా, వారిలో 13 మంది అమెరికా సైనికులున్నారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్‌కు అనుబంధ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ఐఎస్ఐఎస్-కె) ప్రకటించింది.

మరోపక్క, ఇలా పౌరుల వివరాలున్న జాబితాను తాలిబన్లకు ఇచ్చినట్లు తనకు తెలియదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ‘‘ఇంతమంది పౌరులు వస్తున్నారు. వారిని లోపలకు వదలండి అని మాత్రమే తాలిబన్ మిలటరీ అధికారులకు సమాచారం ఇస్తున్నారని తెలుసు. అంతేకానీ, ఇలా జాబితా సిద్దం చేశారని, దాన్ని తాలిబన్ల చేతికిచ్చినట్లు మా దృష్టికి రాలేదు’’ అని బైడెన్ పేర్కొన్నారు.

Related posts

How One Designer Fights Racism With Architecture

Drukpadam

ప్రజారవాణాకు ఆటంకం కలిగిస్తే ఉక్కుపాదం…మంత్రి పువ్వాడ హెచ్చరిక!

Drukpadam

బీహార్‌లో పేలుడు.. 10 మంది మృతి!

Drukpadam

Leave a Comment