చూస్తుండగానే కుప్పకూలిన వంతెన.. భయపడిపోయిన ప్రయాణికులు!

చూస్తుండగానే కుప్పకూలిన వంతెన.. భయపడిపోయిన ప్రయాణికులు!

-భారీ వర్షాలకు వణుకుతున్న ఉత్తరాఖండ్

-కొట్టుకుపోయిన రోడ్లు.. మూతపడిన రహదారులు

-బ్రిడ్జి కూలడంతో నదిలో పడిన వాహనాలు

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వానల కారణంగా నిన్న డెహ్రాడూన్‌లోని రాణీపోఖరి-రిషికేష్ జాతీయ రహదారి వద్ద జఖాన్ నదిపై ఉన్న వంతెన అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వాహనాల్లోని ప్రయాణికులు భయంతో హడలిపోయారు.

ప్రమాదాన్ని ముందే ఊహించిన కొందరు ప్రయాణికులు వాహనాలు దిగి పరుగున ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొన్ని వాహనాలు నదిలో పడి కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు (ఎస్‌డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించాయి. వంతెన కుప్పకూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్ తెలిపారు.

అలాగే, మాల్‌దేవ్‌తా-సహస్త్రధార లింక్ రోడ్డు లోనూ కొంత భాగం కొట్టుకుపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల కారణంగా తపోవన్ నుంచి మలేతా వెళ్లే జాతీయ రహదారి 58ని మూసివేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో రిషికేష్-దేవ్‌ప్రయాగ్, రిషికేష్-తేహ్రి, డెహ్రాడూన్-ముస్సోరి రోడ్లను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

Leave a Reply

%d bloggers like this: