కరోనా గురించి చైనాకు తెలియదు.. అది జీవాయుధం కాదు: అన్ని సిద్ధాంతాలను కొట్టిపారేసిన అమెరికా తాజా నివేదిక!

కరోనా గురించి చైనాకు తెలియదు.. అది జీవాయుధం కాదు: అన్ని సిద్ధాంతాలను కొట్టిపారేసిన అమెరికా తాజా నివేదిక
-బైడెన్ ఆదేశాలతో సిద్ధం చేసిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్
-ల్యాబ్ నుంచి లీకై విస్తరించి ఉండొచ్చని అంచనా
-దాని మూలాలు కనుక్కొని తీరుతామన్న బైడెన్

జీవాయుధం కోసం కరోనాను ల్యాబ్ లోనే చైనా పుట్టించిందని ఒకసారి.. కావాలనే ల్యాబ్ నుంచి లీక్ చేశారని ఇంకోసారి.. ప్రమాదవశాత్తూ లీక్ అయిందని మరోసారి.. ఇలా ఇప్పటిదాకా ఎన్నెన్నో సిద్ధాంతాలను అమెరికా చెబుతూ వస్తోంది. ఇప్పుడు మాట మార్చింది. అసలు అది జీవాయుధమే కాదు అని అంటోంది. అన్ని సిద్ధాంతాలను కొట్టిపారేస్తూ తాజా నివేదికను విడుదల చేసింది. కరోనా వైరస్ పుట్టుక గురించి వివిధ నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలపై సమగ్ర విశ్లేషణ జరిపి నివేదిక ఇవ్వాలన్న అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్.. ఆ నివేదికను సిద్ధం చేసింది.

వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకై మహమ్మారిలా విస్తరించి ఉండొచ్చని నివేదికలో పేర్కొంది. కరోనా జన్యుపరంగా సృష్టించిన వైరస్ కాదని స్పష్టం చేసింది. వివిధ నిఘా సంస్థలు చెబుతున్న సిద్ధాంతాలను నిరూపించే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు ఆ వైరస్ గురించి తెలిసి ఉండకపోవచ్చని పేర్కొంది. ఓ జంతువు నుంచి మనుషులకు సోకిందని, ల్యాబ్ నుంచి లీకైందని అన్ని నిఘా సంస్థలు అంచనా వేశాయని తెలిపింది. అయితే ఏ సంస్థలు కూడా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయాయని పేర్కొంది. అయితే, ఈ నివేదికను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నివేదికపై బైడెన్ స్పందించారు. ప్రపంచం మొత్తాన్ని విషాదంలోకి నెట్టేసిన కరోనా మహమ్మారి మూలాలను కనుగొనేందుకు తమ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని స్పష్టం చేశారు. తద్వారా భవిష్యత్ లో మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడొచ్చని చెప్పారు. అయితే, మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి అంతర్జాతీయ అధికారులనెవరినీ చైనాలోకి ఆ దేశం రానివ్వలేదని, కరోనాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమంతా అక్కడే ఉందని ఆయన తెలిపారు. పారదర్శకంగా ఉండాలన్న అంతర్జాతీయ సమాజ విజ్ఞప్తిని చైనా ఇప్పటికీ తోసిపుచ్చుతూనే ఉందన్నారు.

Leave a Reply

%d bloggers like this: