Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చింతమనేని ప్రభాకర్ ను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు…

చింతమనేని ప్రభాకర్ ను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు…
-చింతమనేని నిన్న అరెస్ట్, నేడు విడుదల
-నోటీసులు ఇచ్చి విడిచిపెట్టిన పోలీసులు
-అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలుసుకున్న చంద్రబాబు
-అండగా ఉంటామని భరోసా
-చింతమనేని అరెస్టుపై డీజీపీ స‌వాంగ్‌కు చంద్ర‌బాబు నాయుడు లేఖ‌
-చింతమనేని ప్రభాకర్ అరెస్టు అక్ర‌మం
-నాయకులపై తప్పుడు కేసులు సరికాదు
-ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు
-తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసులు దృష్టి పెట్టారు
-విడుదల అనంతరం స్వగ్రామానికి వెళ్లిన చింతమనేని

దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు విడుదల చేసిన అనంతరం చంద్రబాబు స్పందించారు. చింతమనేని ప్రభాకర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అరెస్ట్, విడుదల తదితర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, అక్రమ కేసులతో తమ పార్టీ నేతల గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతమనేనికి అండగా ఉంటామని తెలిపారు. అంతకుముందు, చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఇదే అంశంపై లేఖ రాశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాస్తూ, త‌మ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు సరికాదని చెప్పారు.

చింతమనేని ప్రభాకర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చ‌ర్య అని, ధరల పెంపుపై ప్రభాకర్‌ నిరసన వ్యక్తం చేసి, దెందులూరు తహసీల్దార్‌కు వినతి పత్రమిస్తే తప్పుడు కేసులు పెడ‌తారా? అని చంద్రబాబు నిల‌దీశారు. చింత‌మ‌నేని విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే ఆయ‌న‌ను అరెస్టు చేశారని విమర్శించారు.

ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అందులో త‌ప్పేముంద‌ని చంద్రబాబు ప్ర‌శ్నించారు. ఇలా అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేస్తూ పోవ‌డం మంచిది కాదని, ఏపీలో ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదని పేర్కొన్నారు. పోలీసులు ఇలా అక్ర‌మంగా అరెస్టు చేస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయ‌న అన్నారు.

వైసీపీ ప్రేరేపిత పోలీస్‌ రాజ్‌ కనిపిస్తోందని, స‌ర్కారుకి వ్యతిరేకంగా మాట్లాడితే వేధిస్తున్నారని చంద్రబాబు మండిప‌డ్డారు. ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాల‌రాసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు.

త‌మ నేత‌ల‌పై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసులు దృష్టి పెట్టార‌ని ఆయ‌న తెలిపారు. ఏపీలో ప్ర‌తిదినం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్ర‌జలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలను మానుకోవాల‌ని, త‌మ నేత‌ల‌పై త‌ప్పుడు కేసుల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. దెందులూరు పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసిన అనంతరం విడిచిపెట్టారు. ఈ క్రమంలో చింతమనేని తన స్వగ్రామం పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు.

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన చింతమనేనిపై దెందులూరులో కేసు నమోదైంది. పోలీసుల విధులకు మాజీ ఎమ్మెల్యే ఆటంకం కలిగించారంటూ ఆరోపణలు వచ్చాయి. చింతమనేని నిన్న విశాఖ జిల్లాలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ సందర్భంగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, రాత్రంతా చింతపల్లిలో ఉంచారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించారు.

Related posts

తెల్లవారుజామునే కూరగాయల మార్కెట్‌లో రాహుల్ గాంధీ.. వ్యాపారులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత..

Ram Narayana

జగన్ ప్రభుత్వంపై మరోమారు రెచ్చిపోయిన పట్టాభి!

Drukpadam

ఢిల్లీలో కేసీఆర్‌… బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన తెలంగాణ సీఎం!

Drukpadam

Leave a Comment