ప్రక్షాళన దిశగా టీఆర్ యస్ ….ఢిల్లీ బాట పట్టిన నేతలు!

ప్రక్షాళన దిశగా టీఆర్ యస్ ….ఢిల్లీ బాట పట్టిన నేతలు
జిల్లాలలో కమిటీలు లేవు నిర్మాణం లేదుకార్యాలయాలు కట్టలేదు
ఢిల్లీలో టీఆర్ యస్ భవన్జాతీయ రాజకీయాలవైపు చూపులు
ఇటు రాష్ట్రంలోనూ పార్టీ జెండా పండగకు ఏర్పాట్లు
పార్టీలోనూ ,మంత్రివర్గంలో మార్పులపై గుసగుసలు
కేసీఆర్ మదిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం
మంత్రులను మార్చనున్నారా ? లేదా ? అనేదానిపై ఆరా
మోడీ బాటలోనే కేసీఆర్ వెళ్లనున్నారా??
దళితులకు బిసిలకు పెద్దపీట వేయనున్నారా ???

టీఆర్ యస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందా ?….. పార్టీల్లోనూ , మంత్రివర్గంలోని మార్పులు ఉంటాయా … సీనియర్లను పట్టించుకోవడం లేదనే అపవాదు తొలగించుకుంటుందా ?….మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయా ?…. ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందా ?అసలు నిజంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా ? ఉంటె మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు ఉంటాయి . టీఆర్ యస్ లో ఏంజరుగుంతుంది .జాతీయరాజకీయాల్లో అడుగుపెడుతున్నారా? లేదా ? అనే సందేహాలకు ఎలాంటి ముగింపు ఇవ్వనున్నారు. అపరచాణిక్యుడుగా పేరున్న కేసీఆర్ పార్టీ ని ,ప్రభుత్వాన్ని సమన్వయం కోసం ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారనే ఆశక్తి సర్వత్రా నెలకొన్నది . , … అసలు ప్రక్షాళన ఉంటుందా ? . అయితే ప్రక్షాళన జరిగితే చాలామంది మంత్రుల కు ఉద్వాసన ఖాయమేనా లేక చిన్న చిన్న మార్పులతో సరిపెట్టుకుంటారా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు . కేసీఆర్ మదిలో ఏముంది అనేది తెలుసు కోవడం కోసం నానా హైరానా పడుతున్నారు టీఆర్ యస్ లో పలువురు నాయకులు .

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికారం లో ఉన్న టీఆర్ యస్ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పార్టీలో అసమ్మతి లేకుండా చేసుకోవడంతో పాటు ఎన్నికల నాటికీ మరింత పకడ్బందీగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నారు.

పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి , మంత్రి వర్గంలో మార్పులపై రకరకాల అభిప్రాయాలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు మంత్రి వర్గంలో ఈటల రాజీనామా చేయడంతో ఒక ఖాళీ ఏర్పడింది . దాన్ని ఎవరితో భర్తీ చేస్తారు అనే ఆశక్తి నెలకొన్నది. కొంతకాలం కేసీఆర్ కూతురు కవిత ను మంత్రి వర్గంలో తీసుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. ఇందుకు కరీంనగర్ కు చెందిన గంగుల కమలాకర్ ను రాజీనామా చేయిస్తారని ప్రచారం జరిగింది. మరో పక్క మంత్రి వర్గంలో ఎస్సీ మాదిగ సామజిక వర్గానికి చెందిన వారు ఎవరు లేనందున విమర్శలు ఉన్నాయి. బిసిలకు పెద్ద పీట వేయలేదని అభిప్రాయం ఉంది. దీంతో తెలుగు దేశం నుంచి టీఆర్ యస్ లో చేరిన సండ్ర వెంకటవీరయ్య కు గతం లోనే హామీ ఇచ్చినందున ఆయనకు మంత్రివర్గంలో స్తానం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన్నే తీసుకుంటారా ? ఇంకా ఎవరికైనా అవకాశం ఉంటుందా ? అనేది మరో సందేహం . ఇప్పుడు ఉన్న మంత్రి వర్గంలో కొందరి పని తీరుపై కేసీఆర్ అసంతృప్తి తో ఉన్నారని అందువల్ల పెద్ద ఎత్తునే మార్పులు ఉండే అవకాశం ఉందని టీఆర్ యస్ సర్కిల్స్ లో టాక్ . ఇటీవలనే కేంద్రం లో నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంలో అనేక మందిని తొలగించి కొత్త వారికీ అవకాశం కల్పించారు. అదే తరహాలో కేసీఆర్ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తారా ? లేదా అనేది చూడాల్సి ఉందని రాజకీయ పండితుల భావన ….

ఢిల్లీ లో టీఆర్ యస్ కార్యాలయం ప్రారంభానికి సీఎం కేసీఆర్ తో సహా మంత్రివర్గ సహచరులు ముఖ్యనేతలు అంతా హాజరౌతున్నారు. అక్కడ ఎంపీ లు కూడా ఉన్నారు. దీంతో హస్తిన వేదికగా టీఆర్ యస్ నేతలతో చిట్ చాట్ ఉండే అవకాశం ఉంది. జాతీయరాజకీయాలవైపు దృష్టి సారించే ఆవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. రాష్ట్రంలో రాజకీయాలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి దేశ రాజకీయాలపై కేసీఆర్ ద్రుష్టి పెడతారా లేదా ? రాష్ట్రంలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలవారీగానే పదవుల పంపకాలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాలకు ఇద్దరు ,ముగ్గురు మంత్రులు ఉన్నారు. మరికొన్ని జిల్లాలకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి . దీనిపై కేసీఆర్ ఎలాంటి ఆలోచన చేస్తారు అనేది మరో సందేహం .

జిల్లాలలో పార్టీ కమిటీలు లేవు నిర్మాణం లేదు …… పార్టీ కార్యాలయాలు కడతామన్న అన్ని జిల్లాలలో పూర్తీ కాలేదు. జిల్లా కమిటీలని నియమిస్తామని చెప్పి సంవత్సరాలు అయింది. అనుబంధ సంఘాలు అంతంత మాత్రంగానే పని చేస్తున్నాయి. ఉద్యమ పార్టీ వ్యక్తుల పార్టీ గా మారిందనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు…. ఇప్పుడు ఒక ఎత్తు లాగా రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ యస్ రాజకీయపార్టీగా అవతరించింది. ఎన్నికలు, అధికారమే ఎజెండాగా ముందుకు పోతుంది. దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల అనంతరం నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ యస్ ముఖ్యనేతలను సాగర్ లో మోహరింపజేసి ఘన విజయం సాధించింది. ఇప్పుడు హుజురాబాద్ వంతు వచ్చింది. తన మంత్రి వర్గంలో ముఖ్యుడుగా ఉన్న ఈటలను భూకబ్జా వ్యవహారంలో మంత్రి వర్గం నుంచి తొలగించడం ఆయన పార్టీకి శాశనసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈటల బీజేపీ లో చేరడం కీలక పరిణామంగా మారింది. కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ లో ఈటల చేరడం కేసీఆర్ కు గొంతులో పచ్చి ఎలక్కాయ పడ్డ చందంగా మారింది . ఆయన స్వంత్రంగా ఉండటమా? లేదా కాంగ్రెస్ లో చేరతాడు అనుకుంటే బీజేపీ లో చేరడం టీఆర్ యస్ కు కొంత ఇబ్బందిగా మారింది. ఈటల బీజేపీ లో చేరాక అంతకు ముందు ఆయన పై చర్యలకు హడావుడి చేసిన కేసీఆర్ సర్కార్ తరువాత సైలంట్ అయింది. దీంతో కేసీఆర్ కావాలనే ఈటలను బీజేపీ లోకి చేరేలా చేశారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది.

గతంలో పెద్దగా ఉనికిలో లేని బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఢంకా బజాయించి చెపుతుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఆదిశగా ఆలోచనలు చేస్తుంది. దుబ్బాక ఉపఎన్నిక గెలుపు , హైదరాబాద్ లో జరిగిన జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో అధికారం అంచులదాకా రావడంతో బీజేపీ ఆశలు చిగురించాయి. అందువల్ల అన్ని పార్టీల్లో ఉన్న అసమ్మతి నేతలను చేరదీయటం ద్వారా తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఆదిశగా చేస్తున్న ప్రయత్నాలు కొన్ని ఫలితాల నిచ్చాయి.

తెలంగాణ ఇచ్చేంది తామే అయినందున తమకే అనుకూల వాతావరణం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది. గతంకంటే తమకు ప్రజల్లో ప్రతికూల వాతావరణం ఉందని గ్రహించిన కేసీఆర్, పార్టీ లో మార్పులు , మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తేవడంద్వారా ప్రజల ఆలోచనలను టీఆర్ యస్ కు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు . దీంతో 2023 ఎన్నికలే టార్గెట్ గా పార్టీ తో పాటు ,మంత్రివర్గాన్ని సైతం పెద్ద ఎత్తున మార్చడం ద్వారా ప్రక్షాళన చేయాలనీ కొత్త ఎత్తుగడలను కేసీఆర్ ఏస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే కొత్త వారికీ అవకాశం కల్పించాలని ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది . అనేక మంది ఆశావహులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేసీఆర్ మదిలో ఏముంటే అది జరుగుతుంది. ఏముందనేది వేయి డాలర్ల ప్రశ్న. మార్పులు ఖాయం అది ఇప్పుడు అనేది చూడాల్సిందే ?

Leave a Reply

%d bloggers like this: