సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ల కలకలం!

సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ల కలకలం
-తాజాగా రతన్ టాటా పేరిట న్యూస్ వైరల్
-తాను ఆ మాట చెప్పలేదన్న రతన్ టాటా
-‘ద‌స‌రా బంప‌ర్ ఆఫ‌ర్’ అంటూ ఫేక్ న్యూస్.. స్పందించిన -హైద‌రాబాద్ పోలీసులు
-ట్రాఫిక్ చ‌లాన్ల‌పై 50 శాతం డిస్కౌంట్ అంటూ అస‌త్య ప్ర‌చారం
-అక్టోబ‌రు 4 నుంచి 7 మ‌ధ్య‌ చెల్లించ‌వ‌చ్చ‌ని ఫేక్ న్యూస్
-ఇటువంటి డిస్కౌంట్ మేళాల‌ను ప్ర‌క‌టించ‌లేద‌న్న పోలీసులు

ప‌దే ప‌దే ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి వాహ‌నాల‌పై భారీగా చ‌లాన్లు పెండింగ్‌లో ఉంటాయి. అయితే, ఆ చ‌లాన్లు 50 శాతం రాయితీతో చెల్లించే స‌ద‌వ‌కాశాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, ‘ద‌స‌రా బంపర్ ఆఫ‌ర్’ పేరిట ఓ ఫేక్ న్యూస్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. సాధార‌ణంగా ద‌స‌రాకు వ‌స్త్ర దుకాణాలు, ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు వంటివి బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటాయి.

అయితే, ఆ స‌మ‌యంలో ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న చలాన్ల‌కూ ఆఫ‌ర్ అంటూ వ‌చ్చిన అస‌త్య ప్ర‌చారాన్ని చాలా మంది న‌మ్ముతున్నారు. అక్టోబ‌రు 4 నుంచి 7 వ‌ర‌కు గోషామ‌హ‌ల్ స్టేడియంలో ప్ర‌త్యేక లోక్ అదాల‌త్ ద్వారా ట్రాఫిక్ చ‌లాన్ల మొత్తాన్ని చెల్లించ‌వ‌చ్చ‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారంటూ అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనిపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు స్పందిస్తూ అది ఫేక్ న్యూస్ అని స్ప‌ష్టం చేశారు. ఇటువంటి డిస్కౌంట్ మేళాల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని చెప్పారు. సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని, ఇటువంటివి వ్యాప్తి చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

అది ఫేక్ న్యూస్: రతన్ టాటా వివరణ

సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో? ఏది అబద్ధమో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రముఖుల పేర్లతో ఫేక్ వార్తలు పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరుతో ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది.

‘ఆధార్ కార్డు ఆధారంగా మద్యం అమ్మకాలు చేపట్టాలి. మద్యం కొనేవారికి ప్రభుత్వ సబ్సిడీలు అందించకూడదు. ఆల్కహాల్ కొనేవారు ఆహారాన్ని కూడా కొనుక్కోగలరు. మనం వారికి ఉచితంగా ఆహారాన్ని ఇస్తే… వారు మద్యం కొనుగోలు చేస్తున్నారు’ అని రతన్ టాటా చెప్పినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై రతన్ టాటా స్పందించారు. ఈ మాటలు తానెప్పుడూ చెప్పలేదని, ఇది ఫేక్ న్యూస్ అని ఆయన వివరణ ఇచ్చారు.

Leave a Reply

%d bloggers like this: