సింగర్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్!

సింగర్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
-శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం
-శ్రీనగర్ దూరదర్శన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు
-సమావేశం అనంతరం పాటపాడిన శశిథరూర్
-అలనాటి బాలీవుడ్ క్లాసిక్ ‘‘ఏక్ అజనబీ హసీనా సే’’ అంటూ గీతాలాపన

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సింగర్‌గా మారారు. గొంతు సవరించుకొని అలనాటి మధుర గీతాన్ని ఆలపించారు. ఈ సరదా ఘటన శ్రీనగర్‌లో జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ కమిటీకి ఆయనే ప్రాతినిధ్యం వహించారు.

ఈ సందర్భంగా దూరదర్శన్ శ్రీనగర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన గొంతు సవరించుకున్నారు. 1974లో విడుదలైన ‘అజనబీ’ చిత్రంలోని హిట్ సాంగ్ ‘‘ఏక్ అజనబీ హసీనా సే..’’ అంటూ గీతాలాపన చేశారు. ఆ చిత్రంలో ఈ పాటను ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ పాడారు. రాజేశ్ ఖన్నా, జీనత్ అమన్ నటించారు. తాను పాడిన ఈ పాట వీడియోను శశిథరూర్ ట్విటర్లో షేర్ చేశారు.

‘‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కోసం దూరదర్శన్ శ్రీనగర్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం తర్వాత నన్ను పాడమని అడిగారు. సభ్యులంతా అడగడంతో ఇలా పాడాను. రిహార్సల్స్ లేవు, అమెచ్యూర్‌గా ఉంటుంది. కానీ ఎంజాయ్ చేయండి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

మొబైల్‌లో పాట లిరిక్స్ చూస్తూ ఆయన చక్కటి హావభావాలు పలికిస్తూ పాట పాడారు. ఆయన పాడటాన్ని చాలా మంది మొబైల్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Leave a Reply

%d bloggers like this: