ఢిల్లీకి పోయి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు!

ఢిల్లీకి పోయి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ సెటైర్లు!
-ఢిల్లీలో తెలంగాణ భవన్ ఎవరి కోసం కడుతున్నారు?
-టీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు
-అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలి
-ఈ నెల 17 న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ఎవరి కోసం, ఎందుకోసం కడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ను బీజేపీ నమ్మదని.. టీఆర్ఎస్ తో కలిసి బీజేపీ పని చేసే ప్రసక్తే లేదని అన్నారు. మతతత్వ పార్టీ ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ పని చేస్తోందని మండిపడ్డారు.

దళితబంధు మాదిరే బీసీ బంధు, గిరిజన బంధు కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 80 శాతం మంది హిందువులు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్… దళితబంధు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 17 న రాష్ట్రానికి అమిత్ షా ….

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయత్రకు బ్రేక్ పడబోతోంది.

సంజయ్ పాదయాత్ర ఇప్పటికే 100 కిలోమీటర్లు దాటింది. ఈ నెల 17వ తేదీ నాటికి ఆయన పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పాదయాత్రకు ఆయన బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం నిర్మల్ లో జరిగే తెలంగాణ విమోచన సభకు వెళ్లనున్నారు.

మరోవైపు నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి దగ్గర బహిరంగసభను నిర్వహించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. అమిత్ షా పర్యటన సందర్భంగా పాదయాత్ర విశేషాలను ఆయనకు బండి సంజయ్ వివరించనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై కూడా చర్చించనున్నారు. తెలంగాణాలో పట్టుకోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే 2023 ఎన్నికల కోసం పకడ్బందీ వ్యూహాలను రచిస్తుంది. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం ,కీలక నేతల టార్గట్ గా వారితో సంప్రదింపులు ,అసంతృప్తులుగా ఉన్న ప్రజాప్రతినిధులపై వల వేయడం వ్యాపారులు, కాంట్రాక్టర్లు విద్యారంగంలో ఉన్నవారు , ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారిని ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది. వీటి అన్నింటిపై కూడా అమిత్ షా కు రాష్ట్ర నేతలు వివరించనున్నారు .

Leave a Reply

%d bloggers like this: