తాలిబన్లను అలా వదిలేయకూడదు.. శాంతిస్థాపన చేయాల్సిందే!: పాకిస్థాన్!

తాలిబన్లను అలా వదిలేయకూడదు.. శాంతిస్థాపన చేయాల్సిందే!: పాకిస్థాన్!
-ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల చేతిలో వదిలేస్తే ప్రపంచానికే ప్రమాదం
-ఇలాగే వదిలేస్తే అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకూ తీవ్ర ఇబ్బందులు
-పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ల చేతిలో వదిలేస్తే ప్రపంచానికే ప్రమాదమని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు. తాలిబన్ల హస్తగతం అయిన ఆఫ్ఘనిస్థాన్‌ను ఇదే విధంగా కొనసాగనివ్వకూడదని, వారిని ఇలాగే వదిలేస్తే అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

అంతేకాకుండా భవిష్యత్తులో తాలిబన్లతో పెద్ద చిక్కు వచ్చే అవకాశాలు లేక పోలేదని, వాటిని నిర్మూలించేందుకు ఇప్పుడే ముందడుగు వేయాలని ఆయన అన్నారు. అందుకోసం అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘన్ వైపు సానుకూల విధానాన్ని ప్రదర్శించాలని ఆయన కోరారు.

అయితే ప్రస్తుతం స్పెయిన్ విదేశాంగ మంత్రి పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖురేషీ ఈ మాటలు మాట్లాడారు. అంతేకాకుండా తాలిబన్ల హవాను కట్టడి చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఆయన అన్నారు.

శాంతి స్థాపన దిశగా పనిచేయాలని, అందుకోసం తాలిబన్లతో కలిసి పనిచేయాలని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆఫ్ఘన్‌ లో నెలకొన్న మానవ సంక్షోభాన్ని నివారించడంపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాలని సూచించారు. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం జెనీవాలో ఓ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం పట్ల పాక్‌ విదేశాంగ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: