సాయితేజ్ వాళ్లింటికి వెళుతున్నాడు, నవీన్ మా ఇంటికి వస్తున్నాడు… ఇదీ జరిగింది: నరేశ్ వివరణ సాయితేజ్ కు యాక్సిడెంట్!

సాయితేజ్ వాళ్లింటికి వెళుతున్నాడు, నవీన్ మా ఇంటికి వస్తున్నాడు… ఇదీ జరిగింది: నరేశ్ వివరణ
-సాయితేజ్ కు యాక్సిడెంట్
-నరేశ్ వ్యాఖ్యలపై నట్టి కుమార్, బండ్ల గణేశ్ అభ్యంతరం
-నరేశ్ ప్రతిస్పందన
-రేసుల్లేవు, ర్యాష్ గా నడపలేదు అంటూ వివరణ

మెగాహీరో సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యల పట్ల నట్టి కుమార్, బండ్ల గణేశ్ వంటి ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నరేశ్ వివరణ ఇచ్చారు. గతంలో తాను బైక్ యాక్సిడెంట్ కు గురయ్యానని, అందుకే బైక్ రైడింగ్స్ వద్దని చెబుతుంటానని స్పష్టం చేశారు. ఇక, సాయితేజ్, నవీన్ ఓ చాయ్ దుకాణం ఓపెనింగ్ కు వెళ్లారని, ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారని తెలిపారు.

“సాయితేజ్ వాళ్లింటికి వెళుతున్నాడు, నవీన్ మా ఇంటికి వస్తున్నాడు.. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. మీరు సీసీ టీవీ ఫుటేజిని గమనించండి. వాస్తవానికి సాయితేజ్, నవీన్ మంచి బైక్ రైడర్లు. వాళ్లిద్దరూ సాధికారితతో బండ్లు నడుపుతారు. బైక్ పై వెళ్లేటప్పుడు అన్ని రకాల భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు.

సాయితేజ్ వెళ్లేటప్పుడు ఓ బైక్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపై మట్టి ఎక్కువగా ఉండడంతో జారిపడినట్టు పోలీసులు కూడా చెప్పారు. ఘటన జరిగిన సమయంలో సాయితేజ్ బైక్ స్పీడు 60-70 దాటలేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు. స్లిప్ అయి పడిపోవడం వల్ల దెబ్బలు తగిలాయే తప్ప, అక్కడేమీ రేసులు జరగలేదు.. అతనేమీ ర్యాష్ గా బండి నడపనూలేదు.

ఉదయం నేను కొంచెం ఎమోషనల్ అయ్యింది నిజమే. ఎందుకంటే, నవీన్ తో పాటు సాయితేజ్ ను కూడా ఓ బిడ్డగానే చూస్తాను. మద్రాస్ లో ఉన్నప్పటినుంచి చిరంజీవి కుటుంబం, మా కుటుంబం కలిసే ఉన్నాం. సాయితేజ్ కు ప్రమాదం జరగడం దురదృష్టకరం. సాయితేజ్ కోలుకుంటున్నాడన్న విషయాన్ని నాగబాబు గారి ద్వారా తెలుసుకుని ఎంతో సంతోషంగా ఫీలయ్యాను” అని వివరించారు.

Leave a Reply

%d bloggers like this: