Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సాయితేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి!

సాయితేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి!
-సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది
-అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నాం
-ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తాం

సీనీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తలకు బలమైన గాయాలు లేవని, వెన్నుపూసకు ఎలాంటి దెబ్బ తగల్లేదని వెల్లడించారు. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని చెప్పారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తామని తెలిపారు.

నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతివేగమే ప్రమాదానికి కారణమని చెపుతున్నారు. మరోవైపు రోడ్డుపై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయిందని అంటున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని… ఆయన శరీర ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈరోజు మరిన్ని వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్టు చెప్పారు. రేపు మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని తెలిపారు.

మరోవైపు అపోలో ఆసుపత్రికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

నటుడు సాయి ధరమ్‌తేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. నిన్న రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై 108 సిబ్బంది తమకు సమాచారం అందించినట్టు చెప్పిన పోలీసులు ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బైక్‌పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.

మెడికవర్ ఆసుపత్రికి వచ్చిన చిరంజీవి, పవన్ కల్యాణ్…

హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డుప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో చిరంజీవి, పవన్ కల్యాణ్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి తరలివచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే సాయి ధరమ్ తేజ్ కు ఫిట్స్ వచ్చాయి

నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ను తొలుత మెడికవర్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. మరోవైపు సాయితేజ్ కు సంబంధించి మెడికవర్ వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. సరైన సమయంలో సాయితేజ్ ను ఆసుపత్రికి తీసుకొచ్చారని… అందువల్లే ఆయనకు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. సరైన సమయంలో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)లో 108 సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారని కితాబునిచ్చారు.

బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే తేజ్ కు ఫిట్స్ వచ్చాయని… 108 సిబ్బంది తమ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే తేజ్ అపస్మారక స్థితిలో ఉన్నారని మెడికవర్ వైద్యులు చెప్పారు. తేజ్ కు రెండో సారి ఫిట్స్ రాకుండా తాము చికిత్స చేశామని తెలిపారు. ఆ తర్వాత బ్రెయిన్, షోల్డర్, స్పైనల్ కార్డ్, అబ్ డామిన్, చెస్ట్ స్కానింగ్ లు చేశామని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు పెద్ద గాయాలు కాలేదని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వల్ల… ఆయనకు కృత్రిమ శ్వాస పెట్టామని చెప్పారు.

Related posts

కుప్పం వైసీపీ నేత మృతి.. హత్య చేశారన్న తమ్ముడు!

Drukpadam

కడపలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కారుకు నిప్పు!

Drukpadam

ఇదో రకమైన దోపిడీ ….!

Ram Narayana

Leave a Comment