బరాదర్ చనిపోలేదు.. ఆడియో విడుదల చేసిన తాలిబన్లు…

 

బరాదర్ చనిపోలేదు.. ఆడియో విడుదల చేసిన తాలిబన్లు

  • -పోరాటంలో మరణించినట్లు వదంతులు
  • -ఆఫ్ఘన్ డిప్యూటీ ప్రధానిగా ఇటీవలే నియామకం
  • -కొట్టిపారేసిన తాలిబన్లు.. ఆడియో విడుదల

తమ అగ్రనేతల్లో ఒకరైన  ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించినట్లు వస్తున్న వార్తలపై తాలిబన్లు స్పందించారు. బరాదర్‌కు ఏమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు. దీన్ని రుజువు చేయడం కోసం బరాదర్ మాట్లాడిన ఆడియోను తాలిబన్ ప్రతినిధి సులైల్ షహీన్ విడుదల చేశారు. బరాదర్‌పై వస్తున్న వార్తలు వట్టి వదంతులే అని షహీన్ స్పష్టం చేశారు.

అమెరికాతో సంబంధాలను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన తాలిబన్ నేతల్లో బరాదర్ ఒకరు. అయితే ఈ విషయంలో హక్కానీ నెట్‌వర్క్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ హక్కానీతో బరాదర్‌కు మనస్పర్థలు వచ్చినట్లు కొన్ని వదంతులు వినిపించాయి. అయితే ఇలా తమ శిబిరంలో అంతర్గత కలహాలు ఏవీ లేవని తాలిబన్లు పలుమార్లు ప్రకటించారు.

ఇటీవల ఖతార్‌లో విదేశాంగ మంత్రిని కలిసిన తాలిబన్ బృందంలో బరాదర్ కనిపించలేదు. కొన్నిరోజుల క్రితం ఆయన్ను ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా నియమిస్తారని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా ఒమర్ మరణించిన రెండేళ్లకుగానీ ఆ వార్త బయటకు రాలేదు. దీంతో ముఖ్య నేతలు చనిపోతే తాలిబన్లు వెంటనే ప్రకటన చేయరని, బరాదర్ విషయంలో కూడా అదే జరిగిందని వదంతులు వచ్చాయి.

 

Leave a Reply

%d bloggers like this: