కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళితజాతే: సీఎం కేసీఆర్!

కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళితజాతే: సీఎం కేసీఆర్!
-దళిత బంధు సన్నాహక సమావేశం
-దళితులకు యావత్ సమాజం అండగా నిలవాలన్న కేసీఆర్
-వ్యాపారవర్గంగా నిలబెట్టాలని పిలుపు
-ఇదేమీ రొటీన్ కార్యక్రమం కాదని వెల్లడి
-గతంలో ఎవరూ చేపట్టలేదని స్పష్టీకరణ

తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వివక్ష బాధతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది దళిత జాతేనని అన్నారు. ఈ అంశాన్ని అనేక జాతీయ, అంతర్జాతీయ తులనాత్మక అధ్యయనాలు స్పష్టం చేశాయని వివరించారు.

ఓ కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే ఎలా ఆదుకుంటామో, అదే స్ఫూర్తితో దళితులకు యావత్ సమాజం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి, వారిని వ్యాపార వర్గంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిందే దళిత బంధు అని స్పష్టం చేశారు. తరతరాలుగా దళితులను వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను నిర్మూలించాలన్న అత్యున్నత ఆశయంతో దళితబంధు అమల్లోకి తెచ్చామని వివరించారు.

దళితబంధు ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. దళిత బంధు దేశంలో గతంలో ఎవరూ చేపట్టని వినూత్న పథకం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇదేమీ రొటీన్ కార్యక్రమం కాదని, ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పథకం తీసుకురాలేదని స్పష్టం చేశారు.

నాడు తెలంగాణ ఉద్యమం కూడా వివక్షకు వ్యతిరేకంగానే సాగిందని, ఇప్పుడు దళిత బంధును ఓ ఉద్యమంగా అమలు చేయడంలో తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఇమిడి ఉందని ఉద్ఘాటించారు.

ఈ సమక్షా సమావేశంలో పలువురు మంత్రులు ,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఎమ్మెల్యేలు , జడ్పీ చైర్మన్లు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , సీఎంఓ సిబ్బంది నరసింగరావు , పాల్గొన్నారు. ఇందులో మాజీ మంత్రి మోత్కు పల్లి నరసింహులు పాల్గొనటం ,అందునా సీఎం పక్క సీట్లులోనే ఆయన్ను కూర్చోబెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ నిర్ణయానికి విరుద్ధంగా దళిత బందు సన్నాహక సమావేశానికి హాజరైన మోత్కపల్లి బీజేపీ కి గుడ్ బై చెప్పారు. సీఎం కేసీఆర్ ను అభినవ అంబేత్కర్ తో పోల్చారు . టీఆర్ యస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన దళిత బందు అమలు కమిటీ చైర్మన్ గా నియమిస్తారని వార్తలు కూడా వచ్చాయి. మంచి వాగ్దాటి అయినా మోత్కపల్లి ని టీఆర్ యస్ లో చేర్చుకోవడం ద్వారా ఒక గట్టి దళిత వాయిస్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే మోత్కపల్లి కి మంచి ప్రయారిటీ ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .

Leave a Reply

%d bloggers like this: