కేంద్ర ప్రభుత్వాన్ని ‘జాతి వ్యతిరేకి’ అనగలరా?: ఆర్బీఐ మాజీ గవర్నర్​ సంచలన వ్యాఖ్యలు!

కేంద్ర ప్రభుత్వాన్ని ‘జాతి వ్యతిరేకి’ అనగలరా?: ఆర్బీఐ మాజీ గవర్నర్​ సంచలన వ్యాఖ్యలు!
ఇన్ఫోసిస్ పై ఆరెస్సెస్ పత్రిక కథనం పట్ల ఆగ్రహం
కరోనా వ్యాక్సిన్ల విషయంలో కేంద్రమూ విఫలమైంది
జీఎస్టీ అమలు అంత గొప్పగా ఏమీ లేదు
చిన్న సంస్థలను కేంద్రం ఆదుకోవట్లేదు
పెద్ద సంస్థలే బాగా లాభపడుతున్నాయి
రాష్ట్రాల సొమ్మును కేంద్రమే తినేస్తోంది

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మండిపడ్డారు. ట్యాక్స్ ఫైలింగ్ వెబ్ సైట్ లో సమస్యలను పరిష్కరించలేదని పేర్కొంటూ ఇన్ఫోసిస్ సంస్థపై ఇటీవల ఆరెస్సెస్ అనుబంధ పత్రిక విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన రఘురామ్ రాజన్.. మొదట్లో కరోనా వ్యాక్సిన్ల విషయంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్నీ ఇలాగే విమర్శించగలరా? అంటూ ప్రశ్నించారు.

వ్యాక్సిన్లను సమయానికి అందించని కేంద్ర ప్రభుత్వాన్ని ‘జాతి వ్యతిరేకి’ అని అనగలరా? అని నిలదీశారు. ప్రజలు తప్పులు చేయడం సహజమని ఆయన అన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు గొప్పగా లేదన్నారు. మరింత మంచిగా దానిని అమలు చేయొచ్చన్నారు. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలని, కానీ, సొంత ప్రయోజనాల కోసం వాటిని వాడుకోకూడదని ఆయన సూచించారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ కొంత గాడిలో పడిందని అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి రంగం కుదురుకోవడం, వినియోగదారుల వ్యయ సామర్థ్యం పెరగడం వంటి కారణాల వల్ల గత త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదైందన్నారు. అయితే, ఈ వృద్ధి మొత్తం ఆర్థిక రంగానికి వర్తిస్తుందా? లేక వ్యవస్థలోని కొన్ని రంగాల్లోనే వృద్ధి నమోదైందా? అన్నది తెలియాల్సి ఉందన్నారు.

చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, వాటికే లాభాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. పన్ను వసూళ్లు పెరగడం వల్ల కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 30 శాతం పెరిగాయని, రూ.1.12 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయని చెప్పారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు కేంద్రం మద్దతివ్వట్లేదని, బలవంతంగా ఆర్థిక వ్యవస్థను సంఘటితం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాల్లో ఎక్కువ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వాహా చేస్తోందని విమర్శించారు.

Leave a Reply

%d bloggers like this: