కుమారస్వామి సంచలన నిర్ణయం.. 2023లో జరిగే ఎన్నికలకు ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన!

కుమారస్వామి సంచలన నిర్ణయం.. 2023లో జరిగే ఎన్నికలకు ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన!
ఈ నెల 27న తొలి జాబితాను విడుదల చేయనున్న కుమారస్వామి
ఇష్టం లేనివారు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని వ్యాఖ్య
పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్న స్వామి

జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023లో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే ఆయన పార్టీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ నెల 27న 140 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశామని… 27న పార్టీ నేతలతో జరిగే సమావేశంలో వారిలో ఒకరిని ఖరారు చేసి, అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలిపారు.

పార్టీలో కొనసాగాలని ఎవరినీ ప్రాధేయపడే ప్రసక్తే లేదని కుమారస్వామి అన్నారు. జేడీఎస్ లో ఉండేవారు ఉండొచ్చని, వెళ్లిపోయేవారు పోవచ్చని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.

జేడీఎస్ ను కొందరు తక్కువగా అంచనా వేస్తున్నారని… 2023 ఎన్నికల ఫలితాల తర్వాత వీరందరూ పశ్చాత్తాప పడతారని వ్యాఖ్యానించారు. బీజేపీతో జేడీఎస్ కుమ్మక్కయిందనే వార్తలను ఆయన ఖండించారు. తమ అధినేత దేవెగౌడకు వయసు పైబడినా… ఆయనలో ఉత్సాహం మాత్రం తగ్గలేదని అన్నారు.

దీంతో కర్ణాటకలో ఎన్నికలు మరో ఏడాది ఉన్నాయనగానే రాజకీయాలు వేడెక్కేయి. ఇప్పటికే బీజేపీ యడియూరప్పను తప్పించి బస్వారాజ్ బొమ్మాయ్ ని ముఖ్యమంత్రిగా నియమించింది. కాంగ్రెస్ శివకుమార్ , సిద్దరామయ్య మధ్య వార్ నడుస్తున్నది. బీజేపీ లో అసమ్మతి స్వరాలూ వినిపిస్తున్నాయి. కుమారస్వామి తన అభ్యర్థులను ముందుగానే ప్రకటించటంతో మిగతా పార్టీలు కూడా తమ తమ వ్యూహాలతో నిమగ్నమైయ్యాయి.

Leave a Reply

%d bloggers like this: