వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధర చట్టం తేవాలి…

వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధర చట్టం తేవాలి…
-రైతాంగాన్ని ఆదుకోవాలి…మార్కెట్ సౌకర్యం కల్పించాలి
-వ్యవసాయ చట్టాల రద్దు రైతుసంఘాల విజయం
-కేంద్రం విద్యుత్ సంస్కరణలను ఉపసంహరించుకోవాలి
-మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి,

కేంద్ర ప్రభుత్వం మూడు ప్రమాదకర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు, పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్ సమావేశా ‘బిల్లు పెట్టాలని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మంచికంటి హాల్లో సిపిఎం జిల్లా మహాసభల ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షులు, ప్రముఖ విద్యావేత్త రవి మారుతి అధ్యక్షతన జరిగిన సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత సంవత్సర కాలం నుండి దేశవ్యాప్తంగా రైతులు పోరాడటం వలననే మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటన చేసిందని తెలిపారు. పోరాడి విజయం సాధించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తితోనే భవిష్యత్లో రైతు సంఘాలు పోరాడి కనీస మద్దతు ధర చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చేలా ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తేవాలని చూస్తోందని, ఈ చట్టం అమలులోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలపైన భారాలు పెరుగుతాయని ఆయన అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలని , అందుకు సిపిఎం పార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు.

 

ఈ సభలో సిపిఎం. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయని విమర్శించారు. కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నికరంగా వ్యతిరేకించడంలో రాష్ట్ర ప్రభుత్వం తడబడుతోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో, పొడు రైతుల సమస్యల ఘష్కారం విషయంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం అవుతోందని అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలో, ఉద్యోగ సమస్యల పరిష్కారం విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. ఈ విషయాల గురించి సిపిఎం జిల్లా మహాసభలలో చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం మెకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: