చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి

  • టీడీపీలో చేరిన జమ్మలమడుగు నేతలు
  • తనయుడితో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్న నారాయణరెడ్డి
  • నారాయణరెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి సోదరుడు
  • నారాయణరెడ్డి తనయుడికి జమ్మలమడుగు బాధ్యతలు

కడప జిల్లా జమ్మలమడుగు నేతలు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేశ్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. నారాయణ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి సోదరుడు. ఈ క్రమంలో చంద్రబాబు… భూపేశ్ రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు అని వ్యాఖ్యానించారు. వలస పక్షులకు ఇకమీదట టీడీపీలో అవకాశంలేదని, పార్టీలు మారి వచ్చేవారిని ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ వంటి వారు ఉంటారనే అంబేద్కర్ రాజ్యాంగం రాశారని వ్యాఖ్యానించారు. సీఎం గాల్లో వచ్చారు, గాల్లోనే వెళుతున్నారంటూ విమర్శించారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో ఉంచి అప్పులు తెస్తారా? అంటూ ప్రశ్నించారు. అమరావతిని కొనసాగించి ఉంటే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చేదని అన్నారు.  ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడమే సీఎం పని అని ఆరోపించారు. మద్యం ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? అని నిలదీశారు.

వరదల్లో కొట్టుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఈ వరదల్లో ఎక్కడా సహాయ సిబ్బంది కనిపించలేదని తెలిపారు. ప్రకృతి విపత్తుల వేళ కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తోందని వెల్లడించారు.

వ్యవసాయం అంశంపైనా చంద్రబాబు స్పందించారు. వరి వేయొద్దని పాలకులే ఎలా చెబుతారని ప్రశ్నించారు. మరి గిట్టుబాటు ధర కోసం ఏ పంట వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

%d bloggers like this: