సంతానం లేని దంపతులు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకొనే అవకాశం:డీఎంహెచ్ ఓ!

సంతానం లేని దంపతులు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకొనే అవకాశం:డీఎంహెచ్ ఓ!
దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఆన్లైన్ ద్వారా దత్తత పొందవచ్చు
సద్వినియోగం చేసుకోవాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి

అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చట్టబద్ధంగా పిల్లలను దత్తత ఇస్తుంది. జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశానుసారం దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆన్ లైన్ ద్వారా పిల్లలను చట్టబద్ధంగా పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ దత్తత కార్యక్రమం ద్వారా అనాధ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని, విదేశాలకు చెందిన దంపతులు కూడా ఖమ్మంలోని కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ)నిబంధనలకు లోబడి చిన్నారులను దత్తత తీసుకున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి, జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్ సంధ్యారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణువందన పేర్కొన్నారు. బుధవారం స్థానిక శిశు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వివాహం అయి ఐదు,ఆరు సంవత్సరాల నుండి సంతానం లేని దంపతులు పిల్లల కొరకు అనేక రకాలైన వైద్య చికిత్సలు కొరకు వేల రూపాయలు ఖర్చు చేసిన చివరికి నిరాశకు గురయిన వారికి దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలను దత్తత తీసుకోవడం సువర్ణ అవకాశం, సంతానం కొరకు వివిధ వైద్య పరీక్షలు, చికిత్సకు గాను వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్ధిక ఇబ్బందులకు గురికావడమే కాకుండా శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు దత్తత ద్వారా సంతానం కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులో ఉందని, http://www.car a.nic.in వెబ్సైట్ ద్వారా తమ ఇంటి వద్ద నుండే పిల్లల దత్తతకు దరఖాస్తు చేసుకొని సంబంధిత ధృవపత్రాలను ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించే వెసులుబాటు అందుబాటులో ఉందని తెలిపారు. దత్తత ప్రక్రియ ద్వారా పిల్లల సంరక్షించడంతో పాటు సంతానంలేని కుటుంబాలకు ఆనందం ఏర్పడుతుంది. దత్తత తీసుకున్న వారికి చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించబడుచున్న శిశుగృహం ద్వారా ఇప్పటికి 67మంది పిల్లలను దత్తత
ఇవ్వడం జరిగిందన్నారు. వీరిలో 11మంది పిల్లలను ఇతర దేశాల వారు కూడా దత్తత తీసుకోవడం జరిగిందన్నారు.

చైల్డ్ యొక్క వివరాలు అడ్మిషన్ రిజిస్టర్లో ఎంటర్ చేసి కార లో నమోదు చేయడం, శిశుగృహ నందు అప్పగించిన పిల్లలను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కు చూపించి ఆరోగ్యవంతమైన పిల్లలను శిశుగృహలో ఉంచడం జరుగుతుందన్నారు. ఆరోగ్యం బాగాలేని పిల్లలను హాస్పిటల్లోనే చికిత్స చేపించడం జరుగుతుంది.

పిల్లలను దత్తత తీసుకునేందుకు దంపతులు తమ పాన్ కార్డు, ఆధార్ కార్డు, వివాహ ధృవపత్రం, జనన దృవపత్రం, ఆదాయ ధృవపత్రం, ఇద్దరు వ్యక్తుల సిఫారసు లేఖలు, దంపతుల ఆస్తుల వివరాలు, దంపతుల పాస్పోర్టు సైజ్ ఫోటోలు, వారి ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన వైద్య దృవీకరణ పత్రం, సింగిల్ పేరెంట్ విత్ – విడాకుల డిక్రీ /మరణ దృవపత్రం, బందువుల షూరిటీతో పాటు దరఖాస్తు సమర్పించే రోజున 6వేల రూపాయల డిమాండ్ డ్రాఫ్టు జిల్లా సంక్షేమ అధికారి ఖమ్మం వారి పేరున చెల్లించవలెను. అట్టి ధృవపత్రాలు సేకరించిన తరువాత పరిశీలన చేసి చట్టప్రకారం దంపతులకు పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుంది. పిల్లలను దత్తత తీసుకునే రోజున 40వేల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో – సంబంధిత ఏజెన్సీకి చెల్లించవలసి ఉంటుంది.
సెక్షన్ 80 ప్రకారం ఏ వ్యక్తి, సంస్థ అయిన చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించి ఏ అనాధ, విడిచిపెట్టిన, అప్పగించబడిన పిల్లలను దత్తత పొందిన, దత్తత ఇచ్చిన, ప్రతిపాదించిన సదరు వ్యక్తి, సంస్థకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, 1లక్ష రూపాయలు జరిమాన విధించబడుతుంది. సెక్షన్ 81ప్రకారం పిల్లలను కొనడం అమ్మడం జరిగితే వారికి గరిష్టంగా ఐదు సంవత్సరాలు కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుంది.
సెక్షన్ 32 ప్రకారం ఏ వ్యక్తి అయిన అక్రమంగా తమ వద్దకు తీసుకున్న, తప్పిపోయిన, వదిలివేయబడినట్లుగా ప్రకటించిన, కుటుంబ మద్దతులేని అనాథగా చెప్పుకున్న ఇట్టి సమాచారాన్ని 24 గంటలలోపు చైల్డ్ లైన్ సర్వీసెస్కు కాని బాలల సంక్షేమ కమిటీ, బాలల సంరక్షణ విభాగానికి తెలియచేయాల్సి ఉంటుంది. లేనియెడల అది నేరంగా పరిగణించబడుతుంది.
సంతానం లేని దంపతులు చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం కల్పించిన సదవకాశాన్ని వినియోగించుకొని ఆర్ధిక పరిస్థితులు, వివిధ వైద్య ఆరోగ్య పరీక్షల నుండి విముక్తి పొంది దత్తత పొందిన పిల్లలతో ఆ దంపతులు ఆనందంగా జీవనం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కోరినట్టు తెలిపారు.
ఇతర వివరాలకు ఖమ్మం నగరం నర్సింహస్వామి టెంపుల్ రోడ్లో గల శిశుగృహం టెలిఫోన్
08742-25399 కు గాని జిల్లా సంక్షేమ అధికారి సెల్ నెం : 9912517704, బాలల పరిరక్షణ
జిల్లా అధికారి సెల్ నెం : 8332968750 కు సంప్రదించాలని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డిసిహెచ్ఎస్ రామ్మూర్తి నాయక్, శిశు గృహ మేనేజర్ హరికృష్ణ, నర్సు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

%d bloggers like this: