Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అది వేడుక కాదు.. ‘అయోధ్య’ తీర్పు తర్వాత జడ్జిలతో 5 స్టార్ విందుపై రిటైర్డ్ సీజేఐ జస్టిస్ గొగోయ్!

అది వేడుక కాదు.. ‘అయోధ్య’ తీర్పు తర్వాత జడ్జిలతో 5 స్టార్ విందుపై రిటైర్డ్ సీజేఐ జస్టిస్ గొగోయ్

  • ఆత్మకథలో ‘విందు వేడుక’ అని పేర్కొన్న రిటైర్డ్ సీజేఐ
  • ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో అదేమీ కాదన్న జస్టిస్ గొగోయ్
  • పలు వివాదాలపైనా స్పందించిన వైనం
  • రాజ్యసభ సీటు క్విడ్ ప్రోకో కాదని వివరణ

ఇటీవల విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆత్మకథ ‘జస్టిస్ ఫర్ ద జడ్జ్’ అనే పుస్తకంలో అయోధ్య తీర్పుపై రాసుకొచ్చారు. తీర్పు అనంతరం అయోధ్య తీర్పునిచ్చిన ధర్మాసనంలోని జడ్జిలతో విందు ప్రస్తావన తీసుకొచ్చారు. ఓ 5 స్టార్ హోటల్ లో చేసిన డిన్నర్ ఫొటోను పోస్ట్ చేసి ‘అయోధ్య తీర్పుపై వేడుక’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

‘‘తీర్పు చెప్పిన రోజు సాయంత్రం ధర్మాసనంలోని సహ జడ్జిలను తాజ్ మాన్ సింగ్ హోటల్ కు తీసుకెళ్లాను. చైనీస్ ఫుడ్ ను ఆరగించాం. అక్కడ లభించే మంచి వైన్ తాగాం. వాళ్లలో నేనే పెద్దవాడిని కాబట్టి బిల్లు నేనే కట్టాను’’ అంటూ పుస్తకంలో రాసుకొచ్చారు.

అయితే, దీనిపై ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన స్పందించారు. అయోధ్య తీర్పు తర్వాత విందు వేడుక చేసుకోవడం మంచిదంటారా? అని ఎన్డీటీవీ విలేకరి ప్రశ్నించారు. అయితే, పుస్తకంలో ‘వేడుక’ అని రాసుకొచ్చిన జస్టిస్ గొగోయ్.. ఇంటర్వ్యూలో మాత్రం అది ఎంతమాత్రమూ వేడుక కాదని సమాధానమిచ్చారు. ‘‘అది ఎంత మాత్రమూ తీర్పుపై సంబరం కాదు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఆ మాత్రం ఎంజాయ్ మెంట్ ఉండదా? ఆ ఉద్దేశంతో రాసుకొచ్చిన మాటలవి. ధర్మాసనంలోని జడ్జిలంతా నాలుగు నెలల పాటు కష్టపడి అయోధ్య తీర్పును రాశారు. అందరూ చాలా కష్టించారు. దీంతో కొంచెం బ్రేక్ తీసుకుందామన్న ఉద్దేశంతో అందరం కలిసి డిన్నర్ కు వెళ్లాం. అది ఏమైనా తప్పు చేసినట్టా?’’ అని జస్టిస్ గొగోయ్ అన్నారు.

ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత కేసు విచారణ బెంచ్ లో ఉండడంపైనా ఆయన స్పందించారు. ఆ సందర్భంలో ధర్మాసనంలో తాను కొనసాగడం కరెక్ట్ కాదనిపించిందని పుస్తకంలో రాశానని జస్టిస్ గొగోయ్ గుర్తు చేశారు. ‘‘సీజేఐలేమీ స్వర్గం నుంచి ఊడిపడలేదు. 40 ఏళ్ల పాటు కష్టపడితేనే అంత మంచి పేరు సంపాదించాం. ఆ పేరే పోతోందనిపించినప్పుడు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.

లైంగిక వేధింపుల ఆరోపణల కేసు విచారణ పూర్తయ్యే సందర్భంగా.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలన్న వ్యాఖ్యలపైనా సమాధానం చెప్పారు. అది మీడియాకు ఇచ్చిన మంచి సలహా మాత్రమేనన్నారు. ఇలాంటి ఆరోపణలపై మీడియా జాగ్రత్తగా కథనాలను ప్రచురించాలన్నదే ఆ ఆదేశాల ఉద్దేశమన్నారు.

అయోధ్య తీర్పు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై అనుకూలంగా తీర్పులిచ్చినందుకే రాజ్యసభకు ఎన్నికయ్యారన్న వ్యాఖ్యలను జస్టిస్ గొగోయ్ కొట్టిపారేశారు. వచ్చిన ఆఫర్ పై తానేమీ రెండుమూడుసార్లు ఆలోచించుకోలేదన్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యలను, తన సొంత రాష్ట్రం అస్సాం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకది ఓ మంచి అవకాశమని భావించానే తప్ప.. అది క్విడ్ ప్రోకో ఆఫర్ కాదని వివరించారు.

అయితే, రాజ్యసభ రికార్డుల ప్రకారం హాజరు 10 శాతం కూడా లేదని ప్రశ్నించగా.. తాను మాట్లాడాలనుకునే ముఖ్యమైన సమస్యలున్నప్పుడే సభకు వెళ్తానన్నారు. తాను నామినేటెడ్ సభ్యుడినని చెప్పారు. తాను ఏ పార్టీ తరఫున సభలో లేనన్నారు. కాబట్టి ఏ పార్టీ ఆదేశాల మేరకూ తాను నడుచుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనకు నచ్చినప్పుడు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పైగా తాను నామినేట్ అయ్యే సమయానికి కరోనా మహమ్మారి ఎంటరైందని, తాను సభకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడనని జస్టిస్ గొగోయ్ చెప్పుకొచ్చారు.

Related posts

కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణి పై ఆయుష్ కమిషనర్ క్లారిటీ…

Drukpadam

చిన్నజీయర్ స్వామితో నాకు విభేదాలున్నాయని ఊహించుకోవద్దు: సీఎం కేసీఆర్!

Drukpadam

విశాఖ ఎన్ కౌంటర్లో సందె గంగయ్య సహా ఆరుగురు మావోల మృతి!

Drukpadam

Leave a Comment