స్కూల్లో టీచ‌ర్‌పై బ‌కెట్‌తో బ‌డి పిల్ల‌ల దాడి.. టీసీలు ఇచ్చి పంపించేసిన వైనం!

స్కూల్లో టీచ‌ర్‌పై బ‌కెట్‌తో బ‌డి పిల్ల‌ల దాడి.. టీసీలు ఇచ్చి పంపించేసిన వైనం!

  • క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరులో ఘ‌ట‌న‌
  • పాఠాలు చెబుతుండగా విద్యార్థుల దాడి
  • ఓపిక‌తో భ‌రించిన ఉపాధ్యాయుడు
  • పిల్ల‌ల‌పై కేసు నమోదు అంశాన్ని పరిశీలిస్తున్న అధికారులు  

గురువన్న గౌరవం లేదు.. వ‌య‌సులో పెద్ద‌వాడ‌న్న మ‌ర్యాద లేదు.. ఆ పిల్ల‌ల‌కు క‌నీసం 15 ఏళ్ల‌యినా ఉండ‌వు.. స్కూల్లో టీచ‌ర్‌పై బ‌కెట్‌తో బ‌డి పిల్ల‌లు దాడి చేశారు. ఒక విద్యార్థి వ‌చ్చి ఆ ఉపాధ్యాయుడి ప్యాంటునూ లాగాడు. క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరే జిల్లా చెన్న‌గిరి తాలూక న‌ల్లూర గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హిందీ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతుండగా విద్యార్థులు ఈ దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. పిల్ల‌లు అంత‌గా రెచ్చిపోతోన్నా ఆ మాస్టారు కాస్త‌యినా కోపం తెచ్చుకోకపోవ‌డం గ‌మ‌నార్హం. ఆ మాస్టారు వారి చేష్ట‌ల‌ను అంతగా భ‌రిస్తున్న‌ప్ప‌టికీ ఆ విద్యార్థులు తగ్గలేదు. చెత్త బ‌కెట్‌ను ఆ ఉపాధ్యాయుడి త‌ల‌పై పెట్టి వీడియో కూడా తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఆ పిల్ల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ముఖులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ విష‌యంపై మీడియా ఆ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడిని సంప్ర‌దించ‌గా ఈ ఘ‌ట‌న త‌మ దృష్టికి రాలేద‌ని చెప్పారు. ఆ విద్యార్థులు హిందీ టీచ‌ర్ ప్ర‌కాశ్‌ను గ‌తంలోనూ వేధించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా వీడియో వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచ‌ర్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విద్యార్థుల‌కు టీసీలు ఇచ్చి పంపించారు.

పిల్ల‌ల‌పై పోలీసు కేసు కూడా న‌మోదు చేసే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని అధికారులు చెప్పారు. కాగా, ఈ విష‌యం అధికారుల దృష్టికి రావ‌డం, వీడియో వైర‌ల్ కావ‌డంతో హిందీ టీచ‌ర్ ప్ర‌కాశ్‌కు ఛాతీలో నొప్పి వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స అందుతున్న‌ట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని మ‌రోసారి ఇటువంటివి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి, విద్యా శాఖ మంత్రి, పోలీసుల‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: