ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై మండిపడ్డ చంద్రబాబు!

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై చంద్రబాబు స్పందన!

  • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అణచివేయడమే జగన్ లక్ష్యం
  • 30 గంటల తర్వాత రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శ
  • తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపాటు

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిఐడి పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు జరుపుతుండగా రాధాకృష అక్కడకు చేరుకొని సి ఐ డి అధికారుల విధులకు ఆటంకపరిచారనేది ఆయనపై మోపిన ఫిర్యాదు . అయితే రాధాకృష వాదన మరోలా ఉంది. తనకు లక్ష్మీనారాయణ కు మంచి స్నేహం ఉన్నందున అక్కడకు వెళ్లానని తాను వారి వేడులకు ఎలాంటి ఆటంకం కల్పించలేదని పైగా సి ఐ డి అధికారులే తనను ఉండమన్నారని పేర్కొన్నారు. దీనిపై మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో తాము సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడకు వచ్చి ఆటంకాలు కలిగించారంటూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఏపీ సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఏపీ సీఐడీపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆర్కేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారి గొంతులను అణచివేయడమే జగన్ లక్ష్యమని అన్నారు. దాదాపు 30 గంటల తర్వాత రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విమర్శించారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న మీడియాకు ఎన్ని రోజులు సంకెళ్లు విధిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తన అవినీతి బురదను అందరికీ అంటించే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లడమే ఆర్కే చేసిన నేరమా? అని ప్రశ్నించారు.

సీఐడీ అధికారుల సమక్షంలోనే లక్ష్మీనారాయణతో రాధాకృష్ణ మాట్లాడారని… అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని అడిగారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని… సీఐడీ వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని… జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగాయని… అయినా ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న వ్యవస్థలను జగన్ రెండున్నరేళ్లలో నిర్వీర్యం చేశారని చెప్పారు. జగన్ పాలన మొత్తం అప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో సాగుతోందని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: