నైతిక విజయం కాంగ్రెస్ దే.!ఎమ్మెల్సీ ఫలితంపై జగ్గారెడ్డి స్పందన.!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక విజయం సాధించిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేసారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్మలా జగ్గారెడ్డి కోసం జిల్లా కాంగ్రెస్ నాయకత్వం బాగా పనిచేసిందని పేర్కొన్నారు. ఏ లక్ష్యంతో పోటీ చేశామో, ఆ లక్ష్యం నెరవేరిందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సొంత జిల్లాలో ట్రబుల్ షూటర్ హరీష్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా, కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా కాపాడుకున్నామని అన్నారు. 231 ఒట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా గెలుపు మాదే అని చెప్పానని, కాంగ్రెస్ కు ఉన్న ఓట్ల కంటే ఏడు ఓట్లు అదనంగా సాధించగలిగామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు నిజంగా ట్రబుల్స్ లో పడ్డారని, కాంగ్రెస్ భయానికి టీఆరెఎస్ పార్టీ క్యాంపు రాజకీయలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని జగ్గారెడ్డి ఎద్దేవా చేసారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిని స్థానిక ప్రజా ప్రతినిధులు ఎలాంటి క్యాంపులకు వెళ్ళలేదని తెలిపారు, కాంగ్రెస్ అభ్యర్ధి వల్ల జిల్లాలో స్థానిక నేతలు చాలా సంతోషంగా ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడ లేదని, వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశామని, ఇక నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ క్రీడ మొదలుపెడతామని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ స్థానాలను కైవసం చేసుకుంటామని జగ్గారెడ్డి భరోసా వ్యక్తం చేసారు. వరి కప్పలపై రైతులు చనిపోతున్నా టీఆరెఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడనని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేవలం పార్టీ పరంగా బలోపేతానికే పరిమితమని, రాష్ట్ర పార్టీలో నిర్ణయాధికారం పీసీసీ చీఫ్ కే ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: