13 సంస్థలు.. ప్రభుత్వ బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల ఎగవేతలు!

13 సంస్థలు.. ప్రభుత్వ బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల ఎగవేతలు!

  • మొత్తం రూ.4,46,800 కోట్ల రుణాలిచ్చిన బ్యాంకులు
  • కేవలం రూ.1,61,820 కోట్లనే చెల్లిస్తామన్న సంస్థలు
  • 64 శాతం నష్టపోయిన బ్యాంకులు

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.2,84,980 కోట్ల మేర బ్యాంకులు నష్టపోయాయి. 13 సంస్థలు తీసుకున్న అప్పుల్లో ఆ మేరకు ఎగ్గొట్టాయి. దివాలా పరిష్కారంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు ఆ మొత్తాన్ని వదులుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఈ 13 సంస్థలు కలిపి రూ.4,46,800 కోట్లను అప్పుగా తీసుకోగా.. రూ.1,61,820 కోట్లను మాత్రమే చెల్లించేలా పరిష్కార ఒప్పందం కుదిరింది.

దీంతో రూ.2,84,980 కోట్ల మేర బ్యాంకులు నష్టపోయాయి. నష్టశాతం 64 శాతంగా ఉంది. ఎస్సార్, భూషణ్ స్టీల్, జ్యోతి స్ట్రక్చర్స్, డీహెచ్ఎఫ్ఎల్, భూషణ్ పవర్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, మూన్నెత్ ఇస్పాత్, ఆమ్టెక్, అలోక్ ఇండస్ట్రీస్, ల్యాంకో ఇన్ ఫ్రా, వీడియో కాన్, ఏబీసీ షిప్ యార్డ్, శివ శంకరన్ ఇండస్ట్రీస్ సంస్థలు బ్యాంకులకు అప్పును ఎగవేశాయి.

ఇచ్చిన అప్పులను వదులుకోవడంతో పాటు బ్యాంకులపై రూ.6.16 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల భారం ఉంది. అంతేగాకుండా వసూలు కాని బాకీలు కూడా ఎక్కువే ఉన్నాయి. దాదాపు రూ.60,607 కోట్ల మేర రుణాలు రాని బాకీల కిందకు చేరిపోయాయి. దీంతో ఆ రుణాలనూ బ్యాంకులు రద్దు చేయాల్సి వచ్చింది. మొత్తంగా వచ్చిన లాభాల్లో 70 నుంచి 75 శాతం వరకు ఇలాంటి వాటికోసమే బ్యాంకులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంస్థలనే కాకుండా నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేటు బ్యాంకులనూ ప్రభుత్వ బ్యాంకులు ఆదుకున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్ తో పాటు అతిపెద్ద ఎన్ బీఎఫ్ సీ అయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ను ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థలు గట్టెక్కించాయి.

కాగా, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ) ఆరోపించింది. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కు వ్యతిరేకంగా ఈ నెల 16, 17వ తేదీల్లో సమ్మె చేయనున్నట్టు సంఘం కన్వీనర్ బి. రాంబాబు ప్రకటించారు. ఆ బిల్లు వల్ల సామాన్యులకే నష్టం జరుగుతుందన్నారు.

Leave a Reply

%d bloggers like this: