కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం పై ఈటల మండిపాటు…

కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం పై ఈటల మండిపాటు

బీజేపీ పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధం:ఈటల
బండి సంజయ్ తో విభేదాలు, పార్టీ మార్పు పచ్చి అబద్దం … ఈటెల
బీజేపీలో సంతోషంగా ఉన్నాను…తనకు ఎలాంటి ఇబ్బందులు లేవు
కేసీఆర్ కుట్రలో భాగమే తప్పుడు ప్రచారాలు
భవిష్యత్ లో బీజేపీ లో చేరేవారిసంఖ్య భారీగా ఉంటుంది.

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా గురువారం లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వార్తలు ప్రచారం చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని అన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయాలో అన్ని చేయడానికి కేసీఆర్ వెనకాడడని తనకు తెలుసునని అన్నారు .

తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని, కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను మనస్ఫూర్తిగా బీజేపీలో కొనసాగుతున్నానని పార్టీలో సంతోషంగా ఉన్నానని ఈటల రాజేందర్ వెల్లడించారు.

అంతేకాకుండా.. బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో తనకు ఎలాంటి విబేధాలు, గ్యాప్ లేదని.. పట్టనివారు ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. హుజురాబాద్ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ నాయకులు నమ్మకం కోల్పోయారని ఆయన కామెంట్స్ చేశారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే టీఆర్ఎస్‌కు డబుల్ బెడ్రూం ఇళ్లు, నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది కాబట్టి చాలా మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారని, భవిష్యత్తులో బీజేపీలో చేరే వారి సంఖ్య భారీగా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పత్రికలను, మీడియా ఛానళ్లను ఆర్థికంగా దెబ్బతీసేందుకు యాడ్స్ ఇవ్వకుండా మీడియా సంస్థలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీడియా ఛానళ్లను కొనేసి నిజాలను దాచిపెడుతున్నారంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ ఎన్ని చేసిన 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు .

Leave a Reply

%d bloggers like this: