కోడలిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన దళిత కుటుంబం…

 • కోడలిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన దళిత కుటుంబం…
  -చూసేందుకు ఎగబడిన గ్రామస్థులు
  -రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఘటన
  -చివరి నిమిషంలో చేతులెత్తేసిన తొలి హెలికాప్టర్
  -అదనంగా మరో రూ. లక్ష చెల్లించి ఇంకో హెలికాప్టర్ అద్దెకు
  -కల నెరవేర్చుకున్న దళిత కుటుంబం

పుట్టింటి నుంచి మెట్టింటికి రాబోతున్న కోడలిని ఘనంగా తీసుకురావాలని ఆ కుటుంబం అనుకుంది. అనుకున్నదే తడవుగా పెళ్లయిన వెంటనే లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంది. అందులోనే కోడలిని తమ ఇంటికి తీసుకొచ్చింది.

అయితే, కోడలి కోసం ఏకంగా హెలికాప్టర్‌నే అద్దెకు తీసుకున్న ఆ  కుటుంబం చాలా సంపన్న కుటుంబం అని భావిస్తే తప్పులే కాలేసినట్టే. తొలిసారి మెట్టింట్లో అడుగుపెట్టబోతున్న ఆ కోడలికి జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకాన్ని పంచినది ఓ దళిత కుటుంబం అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగిందీ ఘటన.

తరుణ్ మేఘవాల్‌కు బార్మర్ జిల్లా పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని బిధానియన్‌కి ధనీలో మంగళవారం రాత్రి దియాతో వివాహమైంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వారిద్దరూ హెలికాప్టర్‌లో బార్మర్ నగరంలోని జసేధార్ ధామ్‌కి చేరుకున్నారు. వధూవరులిద్దరూ హెలికాప్టర్‌లో గ్రామానికి వస్తున్న విషయం తెలిసిన గ్రామస్థులందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కష్టమైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టడంతో ల్యాండింగ్ సులభమైంది.

తొలిసారి మెట్టింటికి వస్తున్న కోడలిని హెలికాప్టర్‌లో తీసుకురావాలన్నది వరుడి కుటుంబం కల. దానిని ఇలా తీర్చుకున్నారు. అయితే, అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. తొలుత మాట్లాడుకున్న హెలికాప్టర్ చివరి నిమిషంలో సాధ్యం కాదని చేతులెత్తేసింది. దీంతో అదనంగా మరో లక్ష రూపాయలు చెల్లించి ఇంకో హెలికాప్టర్‌ను మాట్లాడుకున్నారు. హెలికాప్టర్‌లో వచ్చిన ఈ జంటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: