న్యాయవాదిని చంపేందుకు కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు అమర్చిన డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్ట్!

న్యాయవాదిని చంపేందుకు కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు అమర్చిన డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్ట్!
-శాస్త్రవేత్తకు, న్యాయవాదికి మధ్య వివాదాలు
-ఒకరిపై ఒకరు కేసులు నమోదు
-స్వయంగా ఐఈడీ బాంబు తయారుచేసిన శాస్త్రవేత్త
-రోహిణి కోర్టులో ఈ నెల 9న పేలుడు
-ఒక పోలీసుకు గాయాలు

ఇటీవల ఢిల్లీలోని రోహిణి కోర్టులో స్వల్ప స్థాయి పేలుడు సంభవించడం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఓ న్యాయవాదిని చంపేందుకే ఈ పేలుడుకు పాల్పడినట్టు గుర్తించారు. ఆ న్యాయవాదిని చంపాలనుకుంది డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్)కు చెందిన ఓ శాస్త్రవేత్త అని వెల్లడైంది.

కోర్టులో ఓ విచారణకు సదరు న్యాయవాది హాజరు అవుతాడని అంచనా వేసిన డీఆర్డీవో శాస్త్రవేత్త కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు అమర్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ శాస్త్రవేత్త పేరు భరత్ భూషణ్ కఠారియా అని, ఆయన చంపాలనుకున్న న్యాయవాది పేరు అమిత్ వశిష్ట్ అని వెల్లడించారు.

వీరిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా అనేక న్యాయపోరాటాలు సాగుతున్నాయి. డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ పై న్యాయవాది అమిత్ వశిష్ట్ 7 కేసులు పెట్టగా… ఆ న్యాయవాదిపై భరత్ భూషణ్ 5 కేసులు పెట్టాడు. వీరిద్దరూ ఇరుగుపొరుగు వారేనని పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది.

ఓ వివాదంలో న్యాయవాది వైఖరితో రగిలిపోతున్న భరత్ భూషణ్… అతడిని అంతమొందించాలని భావించి స్వయంగా ఐఈడీ బాంబు తయారుచేశాడని, దాన్ని కోర్టులోని 102వ నెంబరు గదిలో అమర్చాడని పోలీసులు వివరించారు. డిసెంబరు 9న జరిగిన పేలుడు ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు. కాగా, ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీస్ విభాగం స్పెషల్ సెల్ (నార్తర్న్ రేంజి) అధికారులు డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ కఠారియాను అరెస్ట్ చేశారు.

Leave a Reply

%d bloggers like this: