Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓపికతో ఉండండి.. అవకాశాలు వస్తాయి:కేసీఆర్

ఓపికతో ఉండండి.. అవకాశాలు వస్తాయి

-ఉద్యమంలో పనిచేసినవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది

-టీఅర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్

•ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ఎవరూ మౌనంగా ఉండొద్దు
•గట్టిగా జవాబు ఇవ్వాల్సిందే
అంతా కలిసికట్టుగా ఉండాలి
•రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలి
•పార్టీ నేతలకు కేసీఆర్‌ ఉద్బోధ

రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఉద్బోధించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి నాయకులు, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల నాయకులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరికీ పదవులు వస్తాయని, భవిష్యత్తు మంచిగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఎర్రోళ్ల శ్రీనివాస్‌, క్రిశాంక్‌, జగన్‌, సాయిచంద్‌ తదితరులకు కార్పొరేషన్‌ పదవులు ఇచ్చామని, భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు వస్తాయని చెప్పినట్టు తెలుస్తున్నది. ఎంసీ కోటిరెడ్డి ఓపికతో ఉంటూ పార్టీకి సహకరించారని, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆయనకు నల్లగొండ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, పంచాయతీలు, కార్పొరేషన్లు సహా అనేక పదవుల్లో చాలామందికి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

నడిగడ్డను చూసి నేను కూడా బాధపడిన
పాలమూరు జిల్లా నడిగడ్డకు ఉద్యమ సందర్భంలో వెళ్లినపుడు అక్కడి దయనీయ పరిస్థితి చూసి తాను బాధపడిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకులు బాగు చేసుకున్నామని, ఇప్పుడు నడిగడ్డకు ఆంధ్ర నుంచి వలసలు వస్తున్నారని చెప్పారు. రైతులను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని, వారిని కడుపులో పెట్టుకుంటామన్న కేసీఆర్‌ భావోద్వేగానికి లోనైనట్టు తెలిసింది. ఒకప్పుడు ఒక్క గంగదేవిపల్లె ఆదర్శ గ్రామంగా ఉండేదని, ఇప్పుడు తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా ఉన్నదని, ఊర్లన్నీ పోటీపడుతున్నాయని వివరించారు. మన ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన పథకాల గురించి చర్చ పెట్టాలని, ప్రజలకు వివరించాలని సీఎం చెప్పినట్టు తెలిసింది.

డీఎంకే తరహాలో నిలబెట్టుకుందాం

టీఆర్‌ఎస్‌ను తమిళనాడులోని డీఎంకే తరహాలో నిలబెట్టుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు సమాచారం. ఆ పార్టీలో మూడు-నాలుగు తరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారని, తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా చేయగలిగారని గుర్తుచేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.

కుట్టవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని కాదు పాము కథ చెప్పిన కేసీఆర్‌
టీఆర్‌ఎస్‌ పార్టీని, నాయకులను ప్రతిపక్షాలు విమర్శిస్తే మౌనంగా ఉండొద్దని, తగిన సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్‌ కర్తవ్యబోధ చేశారు. ప్రతిసారీ నిరంజన్‌రెడ్డో, జగదీశ్‌రెడ్డో మాట్లాడుతారులే, మనకెందుకులే అని అనుకోవద్దని చెప్పినట్టు సమాచారం. మన పార్టీనో, నాయకులనో ప్రతిపక్షాలు విమర్శిసే మనకేమి సంబంధం అన్నట్టు వ్యవహరించవద్దని, ఇది సరైన పద్ధతి కాదని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా పాము కథను ఉదహరించారు. ‘ఒకసారి పాములన్నీ కలిసి తమను మనుషులు చంపుతున్నారని, కాపాడాలని దేవుడిని వేడుకుంటాయి. మీరు మనుషులను కుడుతున్నారు, అందుకే వాళ్లు మిమ్మల్ని చంపుతున్నారు, మీరు కుట్టకపోతే వాళ్లు చంపరని దేవుడు చెప్పి పంపిస్తాడు. దేవుడు చెప్పడంతో పాములు కుట్టడం మానేస్తాయి. దీంతో మనుషులు కూడా వాటిని చంపడం మానేస్తారు. పాములు కుట్టకపోవడంతో అడవిలో కట్టెలు కొట్టుకునేవాళ్లు పాములను తాడులా వాడుతుంటారు. దీంతో అవి తీవ్ర ఇబ్బందులుపడి మళ్లీ దేవుడివద్దకు వెళ్తాయి. అప్పుడు దేవుడంటడు.. మిమ్మల్ని కుట్టవద్దని చెప్పినకానీ బుసకొట్టవద్దని చెప్పలేదు కదా. మీకు ఇబ్బంది అయినపుడు.. మీ ప్రాణాల మీదకు వచ్చినపుడు.. మీరు బుసకొట్టి భయపెట్టవచ్చు కదా అని చెప్తాడు- ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, నాయకులు కూడా కనీసం బుసకొట్టుడు కూడా మానేసిండ్రు’ అని చురకలేసినట్టు తెలిసింది. ఏడేండ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు చేశామని కేసీఆర్‌ వివరించారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. వందకుపైగా ఎమ్మెల్యే సీట్లు, అన్ని జడ్పీలు, ఎమ్మెల్సీలు, మున్సిపాలిటీల్లోనూ గెలిపించిండ్రు. ప్రజామోదం సంపూర్ణంగా ఉన్నది. బాధ్యతతో పనిచేస్తున్నాం. జవాబుదారీతనంతో ఉన్నాం. ఎవరో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాటికి మనం జవా బు ఇవ్వాలి. మన బాధ్యత కాదు అన్నట్టు వ్యవహరించవద్ద’ని ముఖ్యమంత్రి కర్తవ్యబోధ చేశారు. నాయకులంతా ఐక్యంగా ఉండాలని, మంత్రులు అందరినీ కలుపుకుని పోవాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, ఇతర నాయకులంతా కల్సిమెల్సి ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎల్లప్పుడూ ప్రజలతో ఉండాలని, ప్రజల కోణంలోనే పనిచేయాలని ఉద్బోధించినట్టు సమాచారం.

Related posts

ఏపీలో టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత కుతూహలమ్మ రాజీనామా!

Drukpadam

ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. గుంజుకొచ్చి జైల్లో వేస్తాం.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్…

Drukpadam

జగన్ తో చిరంజీవి కీలక భేటీ …పరిస్కారం దిశగా సినీ పరిశ్రమ సమస్యలు…

Drukpadam

Leave a Comment