నిజం ఏంటో బయటకు రావాలి.. కెప్టెన్సీ మార్పుపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!

నిజం ఏంటో బయటకు రావాలి.. కెప్టెన్సీ మార్పుపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!

  • మరింత మెరుగ్గా నిర్వహించి ఉంటే బావుండేది
  • చర్చనీయాంశం అయ్యేది కాదు
  • ఎవరు అబద్ధం చెప్పారన్నది అనవసరం
  • వాస్తవం ఏంటన్నది ముఖ్యం

భారత క్రికెట్ జట్టు సారథిని మార్చే వ్యవహారాన్ని మరింత చక్కగా నిర్వహించి ఉండాల్సిందంటూ మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అబిప్రాయపడ్డారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), విరాట్ కోహ్లీ మధ్య మెరుగైన సంప్రదింపులతో ఈ పని చేసి ఉంటే బాగుండేదంటూ వ్యాఖ్యానించారు.

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్పెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి, ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్టు బీసీసీఐ కొన్ని రోజుల క్రితం ప్రకటించడం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను అంతకుముందు రోహిత్ శర్మ చేపట్టాడు. స్వల్ప ఓవర్లతో కూడిన టీ20, వన్డే క్రికెట్ జట్లకు వేర్వేరు కెప్టెన్ లు ఉండరాదన్న ఉద్దేశ్యంతో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా రోహిత్ శర్మకే బీసీసీఐ కట్టబెట్టింది. తాను టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని అప్పట్లో కోహ్లీని కోరానని, అయినా తన మాట వినలేదంటూ కెప్టెన్సీ మార్పు తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యానించారు.

అయితే, కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్నట్టు గంటన్నర ముందే చెప్పారని ఇటీవలే కోహ్లీ ప్రకటన చేశాడు. దీంతో కోహ్లీ ఇష్టంతో సంబంధం లేకుండా బీసీసీఐ ఏకపక్షంగా ఈ పనిచేసినట్టు తేలిపోయింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో మెరుగైన సంప్రదింపులు అవసరమన్నారు.

‘‘చాలా ఏళ్లుగా ఈ వ్యవస్థతో కలసి నడిచాను. గడిచిన ఏడేళ్లుగా ఇదే జట్టుతో ఉన్నాను. మెరుగైన సంప్రదింపులు జరిపి ఉంటే ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చక్కగా ముగిసేది. విరాట్ తన వైపు ఏముందో చెప్పాడు. ఇప్పుడు అసలేమి జరిగిందన్నది ప్రెసిడెంట్ (గంగూలీ) చెప్పాలి. లేదంటే జరిగిన దానిపై స్పష్టతనైనా ఇవ్వాలి. అంతేకానీ, గంగూలీ అబద్ధం చెప్పాడా? లేక కోహ్లీ అబద్ధం చెప్పాడా? అన్నది ఇక్కడ అప్రస్తుతం. తెలియాల్సిందల్లా అసలు వాస్తవం ఏంటన్నదే’’ అన్నారు రవిశాస్త్రి.

Leave a Reply

%d bloggers like this: