చిత్తశుద్ధి ఉంటె బండి సంజయ్ ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్‌లో దీక్ష చేయాలి :కేటీఆర్!

చిత్తశుద్ధి ఉంటె బండి సంజయ్ ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్‌లో దీక్ష చేయాలి :కేటీఆర్!
-యువతను మోసం చేసింది బీజేపీ అందువల్ల
-దీక్ష‌ చేయాల్సింది ఇక్క‌డ కాదు: కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌
-బండి సంజ‌య్ దీక్ష‌పై మంత్రి కేటీఆర్ ఫైర్
-కేంద్ర ప్ర‌భుత్వం యువ‌త‌ను మోసం చేసింది
-ఉద్యోగాలు ఇవ్వ‌కుండా మ‌భ్య‌పెడుతోంది

ఉద్యోగాలు ఇవ్వ‌కుండా తెలంగాణ ప్రభుత్వం ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరుకు నిర‌స‌న‌గా రేపు హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించేదాకా తాము పోరాడుతూనే ఉంటామ‌ని ఆయ‌న చెప్పారు.

ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా ఈ దీక్షలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్ర‌క‌టించారు. దీంతో బండి సంజయ్ దీక్ష‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలోని యువ‌తకు ఉపాధి క‌ల్ప‌న‌లో త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని చెబుతూ ఆయ‌న ఓ బ‌హిరంగ లేఖ రాశారు.

దేశంలోని యువత‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో బీజేపీ స‌ర్కారే విఫ‌మైంద‌ని ఆయ‌న చెప్పారు. బండి సంజ‌య్ చేస్తున్నది నిరుద్యోగ దీక్ష కాద‌ని, సిగ్గులేని దీక్ష అని ఆయ‌న విమ‌ర్శించారు. బండి సంజ‌య్ త‌లపెట్టిన దీక్ష ప‌చ్చి అవ‌కాశవాద దీక్ష అని కేటీఆర్ ఫైర్ అయ్యారు . దేశంలో నిరుద్యోగ యువ‌త కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్రపంచమంతా కరోనా సంక్షోభం ఎదుర్కొంటోన్న‌ సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి కూడా సాయం చేయని పార్టీ బీజేపీ అని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని ఆయ‌న అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఒక శ్వేత‌పత్రం విడుదల చేసే దమ్ముందా? అని ఆయ‌న నిల‌దీశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

బూటకపు దీక్షకు పూనుకున్న బండి సంజ‌య్ రాష్ట్ర యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించే కుట్ర ప‌న్నార‌ని ఆయ‌న అన్నారు. చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదని, ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అని ఆయ‌న అన్నారు. హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన త‌మ ప్రభుత్వాన్ని కాకుండా, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలని ఆయ‌న చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: