గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. కేసీఆర్ అభినందనలు!

  • 2021 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో పురస్కారం
  • ‘వల్లంకి తాళం’ రచనకు అవార్డు
  • తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికతకు దక్కిన గౌరవమన్న కేసీఆర్

ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. 2021 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ‘వల్లంకి తాళం’ కవిత రచనకు గాను అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారం కింద ఆయన ప్రశంసాపత్రంతో పాటు లక్ష రూపాయల నగదు ఇస్తారు.

ఈ సందర్భంగా గోరటి వెంకన్నను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా గోరటి వెంకన్న విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్రను పోషించారని అన్నారు. గోరటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్ఠాత్మక సాహితీ గౌరవం… తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికతకు దక్కిన గౌరవమని చెప్పారు.

ప్రముఖ కవి, శాసన మండలి సభ్యులు శ్రీ గోరెటి వెంకన్న  రచించిన ‘వల్లంకి తాళం’ అనే కవితా సంపుటికి ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ ను ప్రకటించటం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వెంకన్నకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రముఖ కవి, సాహితీ వేత్త శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి తరువాత శ్రీ గోరేటి వెంకన్న ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణం అన్నారు. ఈ అవార్డుతో తెలంగాణ భాషకు, యాసకు గుర్తింపు మరోసారి దేశవ్యాప్తం అయ్యింది అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గోరేటి వెంకన్న  గొప్ప పాత్ర పోషించారు అన్నారు.

Leave a Reply

%d bloggers like this: