గోవా లో కొత్త సంప్రదాయానికి తెర…మాజీ ముఖ్యమంత్రికి శాశ్వత కేబినెట్ హోదా !

గోవాలో కొత్త సంప్రదాయానికి నాంది..  మాజీ ముఖ్యమంత్రి రాణేకు శాశ్వత కేబినెట్ మంత్రి హోదా!  

  • ప్రకటించిన సీఎం ప్రమోద్ సావంత్
  • ఎమ్మెల్యేగా 50 ఏళ్లకు పైగా ప్రజా సేవలో రాణె
  • భవిష్యత్తులోనూ ఈ విధానం కొనసాగుతుందని ప్రకటన

గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ రాణె విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు శాశ్వత కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు.

శాసనసభ్యుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోవా రాష్ట్రానికి రాణె అందించిన గొప్ప సేవలను గుర్తిస్తూ జీవిత కాలం పాటు కేబినెట్ హోదా ఇవ్వనున్నట్టు సావంత్ తెలిపారు. 87 ఏళ్ల రాణె 1987 నుంచి 2007 మధ్య నాలుగు పర్యాయాలు గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. స్పీకర్ గానూ పనిచేశారు.

ఎమ్మెల్యేగా 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులు, మాజీ స్పీకర్ లకు భవిష్యత్తులోనూ ఈ హోదా ఇవ్వనున్నట్టు సీఎం సావంత్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల రాణె కుమారుడు, ప్రస్తుత బీజేపీ సర్కారులో వైద్య మంత్రిగా పనిచేస్తున్న విశ్వజిత్ ధన్యవాదాలు తెలిపారు.

‘‘50 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, ముఖ్యమంత్రిగా అందించిన సేవలకు ఇంతకంటే గొప్ప గౌరవం ఏదీ లేదు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు ధన్యవాదాలు’’ అని విశ్వజిత్ ప్రకటించారు.

Leave a Reply

%d bloggers like this: