స్టేషన్ల వినియోగ రుసుము పేరిట… రైలు ప్రయాణికులపై కొత్త చార్జీ బాదుడు!

స్టేషన్ల వినియోగ రుసుము పేరిట… రైలు ప్రయాణికులపై కొత్త చార్జీ బాదుడు!

  • అన్ రిజర్వ్ డ్ టికెట్లపై రూ.10
  • స్లీపర్ టికెట్లపై రూ.25
  • ఏసీ టికెట్లపై రూ.50
  • మొదట 50 స్టేషన్లలో అమలు 

రైలు ప్రయాణికులు కొంత అదనపు చార్జీలను భరించేందుకు ఇక సిద్ధపడక తప్పదు. కొత్తగా స్టేషన్ల డెవలప్ మెంట్ ఫీజు (ఎస్డీఎఫ్) లేదా యూజర్ ఫీజు రూపంలో రుసుములను రైల్వే శాఖ వసూలు చేయనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లను అత్యాధునిక వసతులతో, విమానాశ్రయాలను తలపించే మాదిరిగా రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. ఈ పనుల కాంట్రాక్టులను ప్రైవేట్ సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్నింటి అభివృద్ధి పూర్తి కాగా, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి.

ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ల నుంచి రైలు ఎక్కి వెళ్లే వారు.. అలాగే ఈ స్టేషన్లలో రైలు దిగే వారి నుంచి ఎస్డీఎఫ్ ను రైల్వే శాఖ వసూలు చేయనుంది. రూ.10 నుంచి రూ.50 వరకు ఈ చార్జీ పడనుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా ఈ చార్జీ సైతం కలసిపోతుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపి నోటిఫై చేసింది. ప్రస్తుతం విమానాశ్రయాల్లోనూ యూజర్ ఫీజును టికెట్ చార్జీలో బాగంగా వసూలు చేస్తున్నారు.

అన్ని రకాల ఏసీ టికెట్లపై రూ.50, స్లీపర్ టికెట్ లపై రూ.25, అన్ రిజర్వ్ డ్ టికెట్లపై రూ.10 గా ఈ చార్జీ ఉంటుంది. సబర్బన్ రైలు సర్వీసులపై ఈ చార్జీ ఉండదు. అంతేకాదు ఇలా అభివృద్ధికి నోచుకున్న స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరను కూడా రూ.10 పెంచనున్నారు. ఈ రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్టేషన్ల అభివృద్ధి, నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు సంస్థలు, రైల్వే పంచుకుంటాయి. ముందుగా 50 స్టేషన్లలో ఈ చార్జీలను అమల్లోకి తీసుకురానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

ఇలా అభివృద్ధికి నోచుకుంటున్న రైల్వే స్టేషన్లు ఏపీలో 21, తెలంగాణలో 8 ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్, తిరుపతి, నెల్లూరు తదితర పట్టణాలున్నాయి. ముందుగా ఏ స్టేషన్లలో అమలు చేసేదీ రైల్వే శాఖ ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు.

Leave a Reply

%d bloggers like this: