టీనేజర్ లా సన్నగా మారిపోయిన రోహిత్ శర్మ కొత్త లుక్ !

టీనేజర్ లా సన్నగా మారిపోయిన రోహిత్ శర్మ కొత్త లుక్ !
కొత్త లుక్ ను పరిచయం చేసిన హిట్ మ్యాన్
తెగ సంబరపడిపోతున్న క్రీడా అభిమానులు
బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రోహిత్
ఫిట్ గా లేకుంటే నష్టమన్న ట్రైనర్లు
5 కిలోలు తగ్గేలా టార్గెట్.. అందుకున్న కెప్టెన్

రోహిత్ శర్మ.. లావైన రూపం, బద్ధకమైన బాడీ లాంగ్వేజ్ మాత్రమే చాలా మందికి తెలుసు. ఆ యాటిట్యూడ్ తో చాలా మంది నుంచి అతడు విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ రోహిత్ కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. తనను తాను పూర్తిగా మార్చేసుకుని కొత్త హిట్ మ్యాన్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు.

గడ్డం తీసేసి.. సన్నగా మారిపోయి.. టీనేజర్ లా తయారయ్యాడు. ఆ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. రోహిత్ లో వచ్చిన ఆ మార్పును చూసి అభిమానులు షాకవుతున్నారు. సహచర ఆటగాళ్లు ‘కుదోస్’ అనేస్తున్నారు. తన భార్య రితికా సజ్దే, ముంబై యాజమాన్యం ఆ ఫొటోపై స్పందించారు. ‘ఎందుకో అంత సుదీర్ఘమైన ఆలోచన’ అంటూ రితిక కామెంట్ చేసింది. ‘ఈ లుక్ నీకు బాగా నప్పింది కెప్టెన్’ అంటూ ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ కాంప్లిమెంట్ ఇచ్చింది.

టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ ఓ అడుగు ముందుకేసి.. ‘అచ్చం అండర్ 19 కెప్టెన్ లా ఉన్నావ్’ అని అన్నాడు. ‘చకాచక్’ అని సింపుల్ గా ఒక్క మాటలో రిప్లై ఇచ్చాడు సూర్య కుమార్ యాదవ్. ‘రోహిత్ లైట్ వెర్షన్’ అంటూ విరాట్ అభిమానులు కామెంట్ చేశారు. గడ్డంలోనే బాగున్నావ్ అంటూ రోహిత్ అభిమానులు అన్నారు. ‘మీరు ఇంకో డబుల్ హండ్రెడ్ కొట్టేయండి.. ఇంటర్నెట్ మొత్తం క్రాష్ కాకపోతే అడగండి’ అంటూ ఇంకో అభిమాని తన అభిప్రాయం చెప్పాడు. తలైవా అని ఇంకో అభిమాని ముద్దుగా బిరుదిచ్చేశాడు.

ఎందుకీ మార్పు?

రోహిత్ కొత్త లుక్ అదిరిపోయినా.. అందరూ శెభాష్ అని మెచ్చుకుంటున్నారు సరే. మరి, అంతలా రోహిత్ ఎందుకు మారిపోయాడు? ఇప్పుడు చాలా మందిలో వస్తున్న ప్రశ్న ఇదే. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ కెప్టెన్ అయ్యాడు. అయితే, వన్డేలు, టీ20లకు దాదాపు ఒకే టీం ఉంటుంది కాబట్టి.. రెండింటికీ వేర్వేరు కెప్టెన్లు ఎందుకు? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. దాని వల్ల జట్టులో సమన్వయం లోపించే ముప్పుందని సెలెక్టర్లు భావించారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండడం, వచ్చే ఏడాదే వన్డే వరల్డ్ కప్ కూడా ఉండడంతో అది జట్టుకు అంత మంచిది కాదని అనుకున్నారు.

దీంతో ఇటీవలే విరాట్ కోహ్లీని తప్పించి.. సౌతాఫ్రికా పర్యటన కోసం వన్డే జట్టు పగ్గాలనూ రోహిత్ కు అప్పగించారు. అది ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. జట్టు ఎంపికకు జస్ట్ గంటన్నర ముందే చెప్పారంటూ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా రోహిత్.. టెస్టు సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూ దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండి శిక్షణ తీసుకుంటున్నాడు.

అయితే, అక్కడ ఉన్న ట్రైనర్లు.. రోహిత్ ఫిట్ గా లేడని భావించారట. ఇదే విషయం అతడికీ చెప్పారని అంటున్నారు. టీ20, వన్డే జట్లకు ఇప్పుడు కెప్టెన్ అయ్యావని, ఫిట్ నెస్ లేకుండా ఇలా గాయాలపాలైతే కెరీర్ కు అంత మంచిది కాదని సూచించారట. అందులో భాగంగానే 5 కిలోలు తగ్గాలన్న టార్గెట్ ను హిట్ మ్యాన్ కు పెట్టారట. ఆ క్రమంలోనే ఫిట్ నెస్ పై దృష్టి సారించిన కొత్త కెప్టెన్.. పెట్టిన ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడట. ఆ కొత్త రోహిత్ శర్మనే ఇలా అందరికీ పరిచయం చేశాడట. ఏదేమైనా ఇది జట్టుకు ఓ రకంగా శుభపరిణామమని క్రీడా నిపుణులు అంటున్నారు. మీరేమంటారు!

Leave a Reply

%d bloggers like this: