హైదరాబాద్‌లో భారీ చోరీ..నగదు జోలికి వెళ్లని దొంగలు!

హైదరాబాద్‌లో భారీ చోరీ.. కోటి రూపాయల విలువైన సొత్తును దోచుకెళ్లిన దొంగలు

  • రెండు కిలోల బంగారు, 4 కిలోల వెండి ఆభరణాలు, రూ. 25 లక్షల నగదు చోరీ
  • మరో రూ. 35 లక్షల నగదు జోలికి వెళ్లని దొంగలు
  • తెలిసినవారి పనేనని అనుమానిస్తున్న పోలీసులు

హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. ఇక్కడి రాజీవ్‌నగర్‌లోని శ్రీ సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దొంగలు.. ఓ ప్లాట్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. రెండు కిలోల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలతోపాటు రూ. 25 లక్షల నగదు దోచుకెళ్లారు. వీటి మొత్తం విలువ కోటి రూపాయల పైనేనని చెబుతున్నారు.

స్టాక్ మార్కెట్ వ్యాపారి అయిన ఫ్లాట్ యజమాని శేఖర్ తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసేందుకని భార్యతో కలసి ఊరెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లో పడి మొత్తం దోచుకెళ్లారు. శంషాబాద్‌లో తమకున్న ఫ్లాట్‌ను ఇటీవల విక్రయించగా వచ్చిన సొమ్మును శేఖర్ ఇంట్లో దాచిపెట్టుకున్నారు. అలాగే, ఓ మిత్రుడు దాచిపెట్టమని ఇచ్చిన రూ. 35 లక్షలు కూడా వీరివద్దే ఉన్నాయి.

అయితే, విచిత్రంగా ఆ రూ. 35 లక్షలను ముట్టుకోని దొంగలు శేఖర్ సొత్తును మాత్రం దోచుకెళ్లారు. దొంగతనం జరిగిన తీరును బట్టి తెలిసిన వారే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Leave a Reply

%d bloggers like this: