పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. ఖర్చు కూడా 40% తక్కువే!

పునాది లేకుండానే ఇంటి నిర్మాణం.. ఖర్చు కూడా 40% తక్కువే!

  • చేసి చూపించిన మైసూర్ ఆర్కిటెక్ట్ శరత్ కుమార్
  • అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ కన్ స్ట్రక్షన్ పద్ధతిలో నిర్మాణం
  • వందేళ్ల దాకా ఇల్లు మన్నుతుందన్న ఆర్కిటెక్ట్
  • 3 నెలల్లోనే ఇంటిని పూర్తి చేయొచ్చని వెల్లడి

ఏ ఇల్లు కట్టాలన్నా.. పునాది అత్యంత కీలకం. ఆరేడు అడుగుల లోతులో గుంతలు తవ్వి.. రాయిరాయి పేర్చి పునాదులు అమరుస్తాం. ఆ పునాదులపై గోడలు లేపి ఆవాసం ఏర్పాటు చేసుకుంటాం. అలాంటి ఆ పునాది ఎంత బాగుంటే ఇల్లు అంత దృఢంగా ఉంటుంది. మరి, అసలు ఆ పునాదే లేకుండా ఇల్లు కట్టడమంటే! అసాధ్యం అంటారా?

కానీ, కర్ణాటకలోని మైసూరుకు చెందిన శరత్ కుమార్ అనే ఓ ఆర్కిటెక్ట్ దాన్ని చేసి చూపించాడు. పునాదుల్లేకుండా కొత్త టెక్నాలజీతో ఇప్పటికే రెండు ఇళ్లు కట్టేశాడు. మరోటి నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. దాని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని శరత్ చెబుతున్నారు.

పునాదుల్లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ఈ కొత్త టెక్నాలజీని అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ కన్ స్ట్రక్షన్ అని అంటారని శరత్ చెప్పారు. రెండేళ్ల పాటు విదేశాల్లో పనిచేసిన ఆయన.. ఈ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుని ఇక్కడ అమలు చేస్తున్నారు. మొదట మైసూరులోని హెచ్ డీ కోటే ప్రాంతంలో ఓ పాల కేంద్రాన్ని నిర్మించారు. అది సక్సెస్ కావడంతో బండిపాళ్యలో ఓ ఇంటిని కట్టేశారు. కర్ణాటకలో పునాదుల్లేకుండా నిర్మించిన తొలి ఇల్లుగా అది రికార్డ్ సృష్టించింది.

టెక్నాలజీలో భాగంగా పునాదులకు బదులు.. ఏడు అడుగుల లోతులో గుంతలు తవ్వి పిల్లర్లను లేపుతారు. ఆ పిల్లర్లను కలుపుతూ కాంక్రీట్ తో బీమ్ లను పోస్తారు. ఆ తర్వాత పైకప్పు వేస్తారు. ఇలా మూడు విధాలుగా ఈ పద్ధతిలో ఇంటిని నిర్మిస్తారు. దీని వల్ల ఇంటి నిర్మాణ సమయం 3 నెలలకు తగ్గుతుందని శరత్ చెప్పారు. కూలీల అవసరం కూడా ఎక్కువగా ఉండదని, నిర్మాణ ఖర్చులో 30 నుంచి 40 శాతం తగ్గుతుందని చెప్పారు. కాంక్రీట్ వాడడం వల్ల వందేళ్ల పాటు ఇల్లు దృఢంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ పద్ధతిలో జీ 2 ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: