చైనా, పాక్ లకు భారత్ ఆర్మీ చీఫ్ ఘాటు హెచ్చరిక …మా సహనాన్ని పరీక్షించ వద్దని చురకలు!

మా సహనాన్ని పరీక్షించే తప్పు చేయవద్దు: చైనా, పాక్ కు ఆర్మీ చీఫ్ హెచ్చరిక
సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేయవద్దు
దాన్ని సఫలం కానివ్వబోము
ఆర్మీ డే ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జనరల్ నరవణె

దేశ సరిహద్దుల వెంట అమలవుతున్న యథాతథ స్థితిని.. ఏకపక్షంగా మార్చేందుకు చేసే ఏ ఒక్క ప్రయత్నాన్ని సఫలం కానివ్వబోమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె అన్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఆర్మీడే పరేడ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత సరిహద్దు భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు నరవణె తన సందేశంతో గట్టి హెచ్చరిక పంపించారు.

‘‘మా సహనం అన్నది ఆత్మ విశ్వాసానికి సూచిక వంటిది. కానీ, ఏ ఒక్కరూ పొరపాటున కూడా దీన్ని పరీక్షించే ప్రయత్నం చేయవద్దు’’ అని ఆయన పేర్కొన్నారు. భారత సైన్యానికి గతేడాది ఎంతో సవాలుగా నిలిచినట్టు నరవణె చెప్పారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ పరిస్థితులను నియంత్రణలో ఉంచినట్టు చెప్పారు. ‘‘గతేడాది ఎన్నో సందర్భాల్లో సరిహద్దుల వద్ద ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. ఎన్నో స్థాయుల్లో ఇరు దేశాలు తీసుకున్న చర్యలు ఫలితాలనిచ్చాయి’’ అని నరవణె పేర్కొన్నారు.

చైనాతో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి గతేడాది కంటే మెరుగ్గానే ఉన్నట్టు నరవణె తెలిపారు. కానీ, పాకిస్థాన్ మాత్రం భారత్ లోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ‘‘సుమారు 300-400 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నారు. ఎన్ కౌంటర్ ఆపరేషన్స్ లో సుమారు 144 మంది ఉగ్రవాదులు హతమయ్యారు’’అని తెలిపారు. బ్రిటిష్ పాలకుల నుంచి 1949 జనవరి 15న ఇండియన్ ఆర్మీ చీఫ్ బాధ్యతలను ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప స్వీకరించిన సందర్భానికి గుర్తుగా ఆర్మీ డే ను జరుపుకుంటారు.

Leave a Reply

%d bloggers like this: