ఇకపై కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట…

ఇకపై కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట: వర్ల రామయ్య ఫిర్యాదుపై సీఈసీ ఆదేశాలు

  • అధికార పార్టీ ప్రయోజనాల కోసం ఓట్లను చెల్లాచెదురు చేస్తున్నారన్న వర్ల ఫిర్యాదు
  • జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం
  • రామయ్య ఫిర్యాదు ప్రతిని పంపి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశం

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇకపై కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట, ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించింది. వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు ప్రతిని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంపిన సీఈసీ.. ఓటర్ల జాబితా,  ఇతర అంశాలపై రామయ్య ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినా, లేదంటే ఉన్న పోలింగ్ స్టేషన్లను పునర్వ్యవస్థీకరించినా ఒకే కుటుంబానికి చెందిన ఓట్లన్నీ ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వర్ల రామయ్య ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ.. అధికార పార్టీ ప్రయోజనాల కోసం వారికి అనుకూలంగా లేని ఓట్లను చెల్లాచెదురు చేస్తున్నారని, ఒకే ఇంట్లోని ఓట్లను వేర్వేరు ప్రాంతాలకు మారుస్తున్నారని ఆరోపించారు.

దీనిపై స్పందించిన సీఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బూత్ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ ఏజెంట్‌ను నియమిస్తే.. తిరిగి పార్టీ ఆ నియామకాన్ని రద్దు చేసినా, లేదంటే నియోజకవర్గం పరిధి నుంచి ఏజెంట్ మారిపోతే తప్ప ఏజెంట్ మార్పు ఉండదని ఈసీ స్పష్టం చేసింది. వైసీపీకి అనుకూలం కాని వారి ఓట్లను వీఆర్వోలు తొలగిస్తున్నారన్న వర్ల ఫిర్యాదుపైనా స్పందించిన ఈసీ.. ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఓటర్ల జాబితా తయారీలో వార్డు, గ్రామ వలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Leave a Reply

%d bloggers like this: