ద‌ళిత బాలుడిని దారుణంగా కొట్టి, కాళ్లు నాకించిన యువ‌కులు.. 

ద‌ళిత బాలుడిని దారుణంగా కొట్టి, కాళ్లు నాకించిన యువ‌కులు.. 

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీలో ఘ‌ట‌న‌
  • ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోన్న ద‌ళిత బాలుడు
  • అత‌డి త‌ల్లి నిందితుల్లోని ఒక‌రి పొలాల్లో కూలీ
  • త‌న‌ త‌ల్లి ప‌నికి సంబంధించిన డ‌బ్బులు ఇవ్వాలన్న‌ విద్యార్థి
  • కార‌ణంగానే బాలుడిపై దాడి?

ఓ ద‌ళిత బాలుడిని కొంద‌రు యువ‌కులు దారుణంగా కొట్టారు. అంతేగాక‌, ఆ బాలుడితో తమ కాళ్లు నాకించుకుని పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను స్మార్ట్‌ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మైన‌ర్ పై దాడి జ‌రిగిన‌ ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీలో చోటు చేసుకుంది.

ఆ ద‌ళిత బాధితుడు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అత‌డి త‌ల్లి నిందితుల్లోని ఒక‌రి పొలాల్లో కూలీగా ప‌నిచేస్తోంది. త‌న‌ త‌ల్లి ప‌నికి సంబంధించిన డ‌బ్బులు ఇవ్వాలని ఆ విద్యార్థి అడగడంతో అత‌డిపై కొంద‌రు యువ‌కులు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ బాలుడిని మొద‌ట బెల్టుతో కొట్టారు. ఆ త‌ర్వాత కూడా వ‌దిలిపెట్ట‌కుండా కాళ్లు నాకాల‌ని నిందితులు డిమాండ్ చేశారు.

ఆ బాలుడు ఏడుస్తూ, త‌న‌ను విడిచిపెట్టాల‌ని కోరినా వినిపించుకోలేదు. ఆ స‌మ‌యంలో భ‌యప‌డిపోతోన్న ఆ ద‌ళిత బాలుడిని చూస్తూ అక్క‌డ ఉన్న ఇత‌రులు గ‌ట్టిగా న‌వ్వారు. ఇటువంటి త‌ప్పు మ‌రోసారి చేస్తావా? అని ఆ ద‌ళిత బాలుడిని ఆ యువ‌కులు ప్ర‌శ్నించారు. చేయ‌బోన‌ని ఆ బాలుడు క‌న్నీరు పెట్టుకున్నాడు. ఆ ద‌ళిత బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్న‌ట్లు అక్క‌డి యువ‌కులు కొంద‌రు ఆరోప‌ణ‌లు చేశారు.

వాళ్లు కొట్టే దెబ్బ‌లు తాళ‌లేక ఆ ఆరోప‌ణ‌ల‌ను భ‌యంతోనే ఆ ద‌ళిత బాలుడు అంగీక‌రించాడు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ నెల‌ 10వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగిందని తెలిపారు. ద‌ళిత బాలుడు త‌మ‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశాడ‌ని, అనంత‌రం వెంట‌నే నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని పోలీసులు చెప్పారు. ద‌ళిత బాలుడిపై ఇటువంటి దారుణానికి పాల్ప‌డ్డ‌ వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ప‌లు సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: