కేంద్రం రైతులను ప్రోత్సహించడం మానేసింది….కేసీఆర్

కేంద్రం రైతులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహానికి గురిచేస్తోంది: సీఎం కేసీఆర్

  • వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • ప్రగతిభవన్ లో అధికారులతో సమావేశం
  • కేంద్రానివి తిరోగమన చర్యలని విమర్శలు
  • దళితబంధుపైనా అధికారులకు దిశానిర్దేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో వ్యవసాయ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను ప్రోత్సహించకుండా, వారిని నిరుత్సాహ పరిచే విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తిరోగమన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

వ్యవసాయ రంగ ఉత్పాదకతను పెంచే చర్యలకు బదులు, దిగుబడులు తగ్గించే చర్యలు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ ప్రభుత్వం సాగురంగాన్ని పురోగామి పథంలో తీసుకెళుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యవసాయ రంగం గొప్పగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

దళితబంధు మరింత వేగంగా లబ్దిదారులకు అందించాలి: కేసీఆర్

సీఎం కేసీఆర్ ఇవాళ దళితబంధు పథకంపైనా సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దళితబంధు అమలుపై సీఎం కార్యదర్శి నివేదిక సమర్పించారు. రోజుకు 400 మందికి దళితబంధు అందిస్తున్నామని, ఇప్పటిదాకా 25,000 మందికి ఇచ్చామని ఆ నివేదికలో పేర్కొన్నారు.

దీనిపై కేసీఆర్ స్పందిస్తూ, దళితబంధు పథకాన్ని అర్హులైన లబ్దిదారులకు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏడాదికి 2 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

తద్వారా దళిత యువతలో నెలకొన్న నిరాశా నిస్పృహలు తొలగిపోయి వారిలో ఉత్సాహం పెరుగుతుందని, వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. ఆసుపత్రులు, ఎరువుల షాపులు వంటి ప్రభుత్వం లైసెన్స్ లు అమలు చేస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలని నిర్దేశించారు.

Leave a Reply

%d bloggers like this: