చిన్నారిని దత్తత పేరుతొ వ్యభిచారంలోకి దించిన మహిళ

13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది అత్యాచారం.. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఘటన

  • చిన్నారిని దత్తత పేరుతో వ్యభిచారంలోకి దింపిన మహిళ
  • తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తరలింపు
  • 80 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మిగతా నిందితుల కోసం గాలింపు
  • నిందితుడు లండన్ లో ఉన్నట్టు గుర్తింపు

తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఘటన జరిగింది. 13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇది. కరోనా మహమ్మారితో ఆసుపత్రిలో చేరిన మహిళను పరిచయం చేసుకుని.. ఆమె కూతురిని దత్తత తీసుకుంటున్నట్టు నటించి.. ఆమె చనిపోయాక చిన్నారిని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది ఓ మహిళ.

ఎట్టకేలకు ఆ చిన్నారిని పోలీసులు ఆ నరక కూపం నుంచి నిన్న బయటకు తెచ్చారు. గుంటూరులోని బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడి.. మొత్తం 80 మందిని అరెస్ట్ చేశారు. ఘటనలో ప్రధాన నిందితురాలు, చిన్నారిని వ్యభిచారంలోకి దింపిన సవర్ణ కుమారినీ అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని గుంటూరు అడిషనల్ ఎస్పీ సుప్రజ తెలిపారు. ఓ నిందితుడు ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు చెప్పారు. అతడిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఇదీ జరిగింది

గత ఏడాది జూన్ లో చిన్నారి బాధితురాలి తల్లి కరోనాతో ఓ ఆసుపత్రిలో చేరింది. అదే ఏడాది ఆసుపత్రిలో కరోనాతో చేరిన సవర్ణ కుమారి.. బాధితురాలిని పరిచయం చేసుకుంది. చిన్నారిని దత్తత తీసుకుంటానంటూ నమ్మబలికింది. ఆగస్టులో చిన్నారి తల్లి చనిపోయాక.. ఆ చిన్నారి తండ్రికి చెప్పకుండానే ఆమెను సవర్ణ తీసుకెళ్లిపోయింది.

దీంతో చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో తొలి అరెస్ట్ చేశారు. నిన్న గుంటూరు వెస్ట్ జోన్ పోలీసులు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 80  మంది నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితులతో పాటు బాలికను విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 8 నెలల పాటు తెలంగాణ, ఏపీల్లోని వివిధ ప్రదేశాలకు ఆ చిన్నారిని వ్యభిచారం కోసం తిప్పారు. చిన్నారి వయసు, ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరాగా తీసుకుని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టారని, పలుమార్లు అమ్మేశారని ఏఎస్పీ సుప్రజ చెప్పారు.

నిందితులను హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడల్లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి నుంచి 53 సెల్ ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: