ఉమ్మడి జిల్లాలో 10 కి 10 అసెంబ్లీ , పార్లమెంట్ గెలుస్తాం …సీఎల్పీ నేత భట్టి!

ఉమ్మడి జిల్లాలో 10 కి 10 అసెంబ్లీ , పార్లమెంట్ గెలుస్తాం …సీఎల్పీ నేత భట్టి
-వరంగల్ లో జరిగే రాహుల్ రైతు భరోసా సభకు జిల్లా నుంచి 10 వేల వాహనాలు
-5 లక్షల మందితో భహిరంగ సభ
-పోలీసులు టిఆర్ఎస్ నాయకుల అవసరాల కోసమే పని చేస్తున్నారు
-అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లతోపాటు పార్లమెంట్ ను గెలుస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు . దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకోసం పనిచేసిందని ,ఇప్పుడున్న ప్రభుత్వాలు తమకోసం పనిచేస్తున్నాయని విమర్శించారు . రైతులు పండించిన పంట ఎవరు కొనాలి అనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలను రైతులు గ్రహించారని తగిన సమయంలో వారికీ బుద్ది చెపుతారని అన్నారు .

రాజకీయ లబ్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు పేరిట ఆడుతున్న రాజకీయ క్రీడలో బలవుతున్న తెలంగాణ రైతులకు భరోసా కల్పించడం కోసమే వచ్చే నెల 6న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని వరంగల్ కు పిలిపించి రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు. 5 లక్షల మందితో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పదివేల వాహనాల్లో రైతులను, ప్రజలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే రైతు సంఘర్షణ సభ విజయవంతం కోసం శుక్రవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పిసిసి ఉపాధ్యక్షులు సురేష్ షెట్కార్ లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం కోసం పని చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలక పక్షాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వివరించారు. నవభారత నిర్మాత ప్రధాని నెహ్రూ అనేక ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నిర్మించారని, వాటి ద్వారా పారే నీటితో పండించిన ధాన్యంతో గత 75 సంవత్సరాలుగా దేశంలో ఆకలి చావులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.

తినటానికి తిండి లేక ఆకలి చావులతో అలమటించచిన దేశంలో ఇప్పుడు ఆహారధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమమే ఇందుకు నిదర్శనమన్నారు. పంటలు పండించడం రైతుల హక్కు అని, రైతులు పండించిన పంటలను కొనాల్సి బాధ్యత సర్కారుదని స్పష్టం చేశారు. నిజాం రాచరిక వ్యవస్థలో కూడా మార్కెట్లు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు వరి వేస్తే ఉరి అని ప్రకటించి రైతులను రాష్ట్ర ప్రభుత్వం నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు . తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిన టిఆర్ఎస్, బిజెపి పాలకులు తమ బాధ్యతను విస్మరించి రాజకీయ లబ్ధి కోసం పోటాపోటీగా ధర్నాలు చేయడం 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తే … కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ తెలంగాణ గల్లీలల్లో ధర్నాలు చేసి రైతులను మభ్య పెట్టడానికి ప్రయత్నించాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలు పేరిట టిఆర్ఎస్ బిజెపి ఆడుతున్న రాజకీయ డ్రామాలపై రైతులను చైతన్యవంతం చేసి వరి వేస్తే ఉరి అని ప్రకటించిన టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తుందని వివరించారు.

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్య, నకిలీ విత్తనాలు, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ తదితర రైతు సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం మీద వత్తిడి తేవడానికి వరంగల్ లో 5 లక్షల మందితో రైతు సంఘర్షణ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ భారీ బహిరంగ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై రైతుల పక్షపాతిగా తెలంగాణ రైతులకు నేనున్నానని భరోసా కల్పిస్తారని వెల్లడించారు. నియంత్రుత్వ పరిపాలన లో రైతు సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించే వరంగల్ రైతు సంఘర్షణ సభకు రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసులు టిఆర్ఎస్ నాయకుల అవసరాల కోసమే పని చేస్తున్నారు

టిఆర్ఎస్ నాయకుల రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందే అవసరాలు తీర్చడం కోసం పోలీసులు రాష్ట్రంలో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థ పైన టిఆర్ఎస్ నాయకుల ఆజమాయిషీ, పెత్తనం చెలాయిస్తూ రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థులను, ప్రశ్నించిన వారిని వెంటాడి వేటాడి రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ పీడీ యాక్ట్ కేసులు పెట్టిస్తున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని సూచించారు. పీడీ యాక్ట్ కేసులు పెట్టేంత నేరం ప్రతిపక్ష నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. పోలీసులు పోలీసులుగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు వస్తూపోతూ ఉంటాయని అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. పోలీసు పోలీస్ గా చేయాల్సిన బాధ్యతను విస్మరించడం వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు.
ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు పాల్పడుతుందని, అధికార పార్టీ ఆగడాలు, అరాచకాలు శృతిమించడంతో పోలీసులు అధికార పార్టీ నేతలకు సహకరించడం వల్ల దిక్కుతోచని స్థితిలో న్యాయం దొరకలేదు అన్న భావనలో ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తాజాగా ఖమ్మంలో సాయి గణేష్, రామాయంపేటలో సంతోష్ అతని తల్లి పద్మలు సజీవదహనం చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయన్నారు.

Leave a Reply

%d bloggers like this: