ఖమ్మం లో సాయి గణేష్ ఆత్మహత్య పూర్వాపరాలు…

ఖమ్మం లో సాయి గణేష్ ఆత్మహత్య పూర్వాపరాలు…
-చర్చ్ కాంపౌండ్ లో విగ్రహ వివాదమే కారణమా ?
-మొదట శిలువ పెట్టాలని యోచనతో వచ్చిన తగాదా ?
-దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ
-తరవాత మథర్ థెరిసా విగ్రహం ఏర్పాటు
-దానిపైన అభ్యంతరాలు …ఏ విగ్రహం పెట్టవద్దు అని హైకోర్టు ఆదేశాలు
-అక్కడ ఎలాంటి విగ్రహాలు లేకుండా తొలగించిన జిల్లా అధికారులు

ఖమ్మంలో విగ్రహ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి సాయిగణేష్ ఆత్మహత్యకు దారితీసింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం . ఆయనపై ఆధారపడ్డ అమ్మమ్మ ,చెల్లి
భాదలు ఎవరు తీర్చలేనివి . విగ్రహం పెట్టాలనే ఆలోచన… వద్దనే డిమాండ్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది . మొదట శిలువ పెట్టాలనే ప్రతిపాదన , దాని నిర్మాణం జరుగుతుండగానే కూల్చివేత , తరవాత మథర్ థెరిసా విగ్రహ ఏర్పాటు , దానిపై హైకోర్టు జోక్యం ఏ విగ్రహాలు పెట్టరాదని ఆదేశాలు జరిగిపోయాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెట్టిన మథర్ థెరిసా విగ్రహాన్ని కూడా జిల్లా అధికారులు తొలగించారు . ఇవి అన్ని చాలానెలలుగా జరుగుతున్న కార్యక్రమాలు . ఈ సంఘటనలో పోలీసులు చాలామందిపై కేసులు పెట్టారు . కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు . మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా అల్లరి చేస్తారన్న వారిని బైండోర్ చేయడం సాధారణంగా జరుగుతుంది. లేదా వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఏప్రిల్ 16 న కేటీఆర్ ఖమ్మం లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది . అందులో భాగంగానే సాయి గణేష్ ను త్రి టౌన్ పోలీసులు పిలిచారు . అప్పటికే అతనిపై రౌడీ షీట్ ఉన్నందున పోలీసులు తరుచు పిలిచి వేధిస్తున్నారని ఆవేదనలో ఉన్న సాయి గణేష్ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు . గుర్తించిన పోలీసులు వెంటనే ఖమ్మం లోని హాస్పటల్ కు తరలించారు . అక్కడనుంచి మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ తరలించారు . అయనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాయి గణేష్ మంత్రి , స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న వేధింపులవల్లనే తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పటం తో కేసు రాజకీయాల వైపు మళ్లింది.

రాజకీయరంగు పులుముకున్న సాయి గణేష్ ఆత్మహత్య

బీజేపీ దీన్ని సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి కుటుంబసభ్యులతో మాట్లాడారు r.ఇద్దరు కేంద్రమంత్రులు , ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఖమ్మం బాట పట్టారు . దీంతో సాయి గణేష్ ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది . బీజేపీ ,టీఆర్ యస్ మధ్య విమర్శలు , ప్రతివిమర్శలకు దారితీసింది. మధ్యలో కాంగ్రెస్ కూడా దూరింది. ప్రధానంగా కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి జిల్లా మంత్రి అజయ్ పై విమర్శలు గుప్పించారు. అంతకుముందు కాంగ్రెస్ కు చెందిన వారిపై మంత్రి ప్రోద్బలంతో పోలీసులు పిడి యాక్ట్ ,రౌడీ షీట్లు కేసులు పెట్టి వేధించారని ,సాయి గణేష్ హత్యలో మంత్రి అజయ్ ని ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేశారు . రేణుక చౌదరి ప్రకటనపై టీఆర్ యస్ మండి పడింది.ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు . పోలీసులు అతిగా ప్రవర్తించడం వల్లనే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి . ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది విచారణలో తేలుతుంది.

మంత్రి అజయ్ తో సహా 9 మందికి హైకోర్టు నోటీసులు …

ఇప్పుడు జిల్లా మంత్రి అజయ్ పై గాలిదుమారం వీస్తుంది … ఈ ఆత్మహత్య కేసును సిబిఐ కి అప్పగించాలని బీజేపీ హైకోర్టు ను ఆశ్రయించింది. హైకోర్టు అజయ్ తోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు , స్థానిక పోలీసులకు నోటీసులు జారీచేసింది. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని , కేసులో ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ బలంగా ఉంది. అయితే జరిగిన సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదనే అభిప్రాయంతో అజయ్ ఉన్నారు . ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం తపన ,ప్రత్యేకించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నానని తనకు ఎవరిమీద కక్ష్యలు కార్పణ్యాలు లేవని అంటున్నారు . కొందరు కావాలని కుట్రపన్ని తనను ఇరికించి లబ్ది పొందాలని చూస్తున్నారని అందులో తన కులస్తులుగా చెప్పుకునే సూడో కమ్మలు కూడా ఉన్నారని అంటున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఉన్న కమ్మ మంత్రిని తానొక్కడినేనని అందువల్ల కమ్మ కులస్తులంతా తనకు అండగా ఉండాలని అంటున్నారు .

అజయ్ ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారా ?

అజయ్ ని మంత్రి వర్గం నుంచి తొలగిస్తారా ?సీఎం కేసీఆర్ ముందు బీజేపీ ,కాంగ్రెస్ ల డిమాండ్ నెరవేరుతుందా అంటే సాధ్యం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ చాల మొండిఘటం ఆయన అనుకుంటే తప్ప ఆయన ముందు ఎవరి పప్పులు ఉడకవు . సాయి గణేష్ ఆత్మహత్యను ఎవరు సమర్థించరు . చివరకు మంత్రి అజయ్ కూడా దురదృష్టకర సంఘటనగానే భావిస్తున్నారు . కానీ దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఏమి జరుగుతుందో చూద్దాం మరి ….

Leave a Reply

%d bloggers like this: