నోరు జారి పోలీసుల మ‌నసు నొప్పించా సారీ… ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి!

నోరు జారి పోలీసుల మ‌నసు నొప్పించా సారీ… ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి!
-పోలీసుల‌ను నా కుటుంబ స‌భ్యులుగా భావిస్తానన్న మహేందర్ రెడ్డి
-శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో పోలీసుల కృషి అభినంద‌నీయమని కితాబు
-పోలీసులంటే తనకు ఎన‌లేని గౌర‌వ‌మ‌న్న మ‌హేంద‌ర్ రెడ్డి

మాజీ మంత్రి టీఆర్ యస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై దుర్బాషలాడిన ఘటనలో రెండురోజులుగా వస్తున్నా వార్తలపై మహేందర్ రెడ్డి సారీ చెప్పారు . టీఆర్ యస్ అధిష్టానం సీరియస్ అవడంతో ఆయన వెనక్కు తగ్గి సి ఐ కి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

తాండూరు ప‌ట్ట‌ణ సీఐని దుర్భాష‌లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి తాజాగా ఆ ఘ‌ట‌న‌పై ప‌శ్చాత్తాపం వ్యక్తం చేశారు. నోరు జారి పోలీసుల మ‌న‌సు నొప్పించాన‌ని పేర్కొన్న మ‌హేంద‌ర్ రెడ్డి.. ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డికి త‌న‌కంటే అధిక ప్రాధాన్య‌మిస్తున్నారంటూ తాండూరు టౌన్ సీఐపై మ‌హేంద‌ర్ రెడ్డి బూతు పురాణం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోన్ కాల్ ఆడియో బుధ‌వారం నాడు మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌పై టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియ‌స్ కాగా…తాజాగా మ‌హేందర్ రెడ్డి ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తూ ఓ ప్ర‌కట‌న విడుద‌ల చేశారు. “నోరు జారి పోలీసుల మ‌న‌సు నొప్పించినందుకు విచారం వ్య‌క్తం చేస్తున్నా. పోలీసుల‌ను నా కుటుంబ స‌భ్యులుగా భావిస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో పోలీసుల కృషి అభినంద‌నీయం. పోలీసులంటే నాకు ఎన‌లేని గౌర‌వం ఉంది” అని మ‌హేంద‌ర్ రెడ్డి ఈ ప్ర‌కట‌నలో పేర్కొన్నారు.

 

వైర‌ల్ అవుతోన్న‌ ఆ ఆడియో నాది కాదు: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న ఓ ఆడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. గ‌త శనివారం తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ సీఐ రాజేందర్‌రెడ్డి వారికి అడ్డు చెప్ప‌లేద‌ని మహేందర్‌రెడ్డి నిన్న‌ మధ్యాహ్నం సీఐకి ఫోన్ చేసి దూషించిన‌ట్లు స‌మాచారం.

దీంతో మ‌హేంద‌ర్ రెడ్డిని ‘సర్‌ మంచిగా మాట్లాడండి’ అని సీఐ అన్నారు. మ‌హేంద‌ర్ రెడ్డి మ‌రింత ఆగ్ర‌హానికి గురై బూతులు తిట్టిన‌ట్లు ఆ ఆడియోలో విన‌ప‌డుతోంది. దీంతో మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై ఇప్ప‌టికే తాను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాన‌ని సీఐ తెలిపారు. మహేందర్‌రెడ్డి తీరుపై రోహిత్‌రెడ్డి మ‌ద్ద‌తుదారులు గ‌త‌రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.

దీనిపై ఈ రోజు మ‌హేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోన్న‌ ఆ ఆడియో తనది కాదని అన్నారు. తాను ఈ విష‌యాన్ని కోర్టులో తేల్చుకుంటానని, ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారని ఆయ‌న అన్నారు.

పోలీసులు త‌న‌కు నోటీసు ఇస్తే విచారణ‌ ఎదుర్కొంటాన‌ని చెప్పారు. త‌న‌పై రోహిత్ రెడ్డి ఉద్దేశ‌పూర్వ‌కంగా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆయ‌న అన్నారు. భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తన ముందుకు రౌడీ షీటర్లు వచ్చార‌ని, త‌న‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నాలు చేశార‌ని చెప్పారు. దీనిపై తాను రూరల్, టౌన్ సీఐతో మాట్లాడాన‌ని తెలిపారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.

Leave a Reply

%d bloggers like this: