నడి వయసులో పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే!

నడి వయసులో పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే!
పిల్లలతో కలిసి పరీక్షలు రాస్తున్న ఎమ్మెల్యే అంగద కన్హర్
1980లో చదువు ఆపేసిన కన్హర్
కుటుంబ సమస్యలే కారణం
ఇన్నాళ్లకు మళ్లీ పరీక్షలు రాస్తున్న వైనం

ఒడిశా ఎమ్మెల్యే అంగద కన్హర్ వార్తల్లోకెక్కారు. అందుకు కారణం ఆయన పదో తరగతి పరీక్షలు రాయడమే. అంగద కన్హర్ బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీకి చెందిన శాసనసభ్యుడు. ఫూల్ బనీ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంగద కన్హర్ వయసు 58 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో మీడియా ఆయనపై దృష్టి సారించింది.

తనను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ సమస్యలతో చదువు మధ్యలోనే ఆపేశానని, పదో తరగతి పరీక్షలు రాయలేకపోయానని అంగద కన్హర్ వెల్లడించారు. తన క్లాస్ మేట్స్, సీనియర్లు చాలా కష్టపడి చదువుకున్నారన్న ఉదంతాలు విని తనలోనూ స్ఫూర్తి కలిగిందని చెప్పారు. సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదని గుర్తించానని, కానీ కొద్దిగా భయపడ్డానని వెల్లడించారు.

అయితే, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు తనను ప్రోత్సహించి పరీక్షలు రాసేలా చేశారని వివరించారు. కాగా, కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని హైస్కూల్ లో ఆయనకు సెంటర్ కేటాయించగా, ఇతర విద్యార్థులతో కలిసి ఇవాళ పరీక్షకు హాజరయ్యారు. ఎమ్మెల్యే పరీక్ష రాస్తుండడంతో హైస్కూల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

%d bloggers like this: