ఐరాస్ చీఫ్ కీవ్ వీధుల్లో పర్యటిస్తున్న సమయంలో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం: రష్యా వెల్లడి

ఐరాస్ చీఫ్ కీవ్ వీధుల్లో పర్యటిస్తున్న సమయంలో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం: రష్యా వెల్లడి
-గురువారం కీవ్ లో పర్యటించిన ఆంటోనియో గుటెర్రాస్
-అత్యంత సమీపంలో రష్యా దాడి
-ఆర్టియోమ్ మిసైల్ కేంద్రం ధ్వంసం
-దిగ్భ్రాంతికి గురైన ఐరాస బృందం

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రాస్ గురువారం నాడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. రష్యన్ సేనల దాడుల్లో ధ్వంసమైన కీవ్ వీధులను ఆయన పరిశీలించారు. ఓవైపు పర్యటన సాగుతున్న సమయంలో, ఐరాస బృందం ఉన్న ప్రాంతానికి సమీపంలోనే రష్యా దీర్ఘ శ్రేణి గగనతల క్షిపణులతో దాడి చేసింది. దాంతో ఆంటోనియో గుటెర్రాస్ తో ఆటు ఐరాస బృందంలోని ఇతర సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొద్దిలో మిస్సయ్యాం అన్న భావన తమలో కలిగిందని ఐరాస ప్రతినిధి సావియానో అబ్రూ తెలిపారు.

దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఐరాస చీఫ్ కీవ్ లో పర్యటిస్తున్న సమయంలో తమ దళాలు అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేపట్టాయని వెల్లడించింది. ఎక్కడా గురితప్పని రీతిలో, నేరుగా లక్ష్యాన్ని తాకే రీతిలో తమ వాయుసేన దాడులు కొనసాగాయని వివరించింది. ఈ దాడుల్లో కీవ్ లో ఉన్న ఆర్టియోమ్ మిసైల్ తయారీ కేంద్రంతో పాటు, ఉక్రెయిన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం కూడా ధ్వంసం అయినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అటు, ఈ దాడులను ఉక్రెయిన్ కూడా నిర్ధారించింది. దాదాపు రెండు వారాల తర్వాత రష్యా సేనలు కీవ్ పై దాడులు చేపట్టాయని, ఒకరు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది. కాగా, ఐరాస్ చీఫ్ గుటెర్రాస్, బృందంలోని ఇతర సభ్యులు మాత్రం తమకు అత్యంత సమీపంలో దాడి జరగడం పట్ల చాలాసేపటి వరకు తేరుకోలేకపోయారు. ఈ ఘటనను వారు ‘షాకింగ్’ అని అభివర్ణించారు.

Leave a Reply

%d bloggers like this: