ఏపీ విశ్రాంత ఐఏఎస్‌కు జైలు శిక్ష విధించిన హైకోర్టు!

ఏపీ విశ్రాంత ఐఏఎస్‌కు జైలు శిక్ష విధించిన హైకోర్టు!

  • బీపీఈడీ కోర్సు అభ్య‌సించేందుకు ఎస్జీటీల‌కు అనుమ‌తి నిరాక‌రిస్తూ అప్పటి విద్యా శాఖ డైరెక్ట‌ర్ చిన‌వీర‌భ‌ద్రుడు మెమో 
  • మెమోను కొట్టేస్తూ గ‌తేడాదే కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు
  • కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌ని విద్యా శాఖ‌
  • మరోమారు హైకోర్టును ఆశ్ర‌యించిన ఎస్జీటీలు
  • చిన‌వీర‌భ‌ద్రుడికి 4 వారాల జైలు, రూ.2 వేల జ‌రిమానా విధింపు

ఏపీ హైకోర్టు మంగ‌ళ‌వారం నాడు మ‌రో కీల‌క తీర్పు చెప్పింది. పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసి ఇటీవ‌లే రిటైర్ అయిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చిన‌వీర‌భ‌ద్రుడికి 4 వారాల జైలు శిక్ష‌తో పాటు రూ.2 వేల జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ప్ర‌భుత్వ‌ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్య‌ర్థ‌న మేర‌కు శిక్ష అమ‌లును రెండు వారాల పాటు నిలుపుద‌ల చేస్తున్న‌ట్లు హైకోర్టు ప్ర‌క‌టించింది.

ఈ కేసు పూర్వా‌ప‌రాల్లోకెళితే… గ‌తంలో పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ హోదాలో చిన‌వీర‌భద్రుడు ఓ మెమో జారీ చేశారు. ఈ మెమోతో ఎస్జీటీ (సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్‌)లుగా ఉన్న ఉపాధ్యాయులు బీపీఈడీ కోర్సును అభ్య‌సించేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఈ కోర్సు స‌ర్టిఫికెట్ లేని కార‌ణంగా త‌మ ప‌దోన్న‌తుల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని ఎస్సీ, ఎస్టీ కేట‌గిరీకి చెందిన ఎస్జీటీలు గ‌తేడాది హైకోర్టును ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. మెమోను ర‌ద్దు చేస్తూ ఎస్జీటీలు బీపీఈడీ కోర్సు చేసేందుకు వీలుగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే హైకోర్టు జారీ చేసిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయ‌లేదు. దీంతో మ‌రోమారు ఎస్జీటీలు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌గా… కోర్టు ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయ‌ని పాఠ‌శాల విద్యా శాఖపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వివాదానికి కార‌ణ‌మైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిన‌వీర‌భ‌ద్రుడికి 4 వారాల పాటు జైలు శిక్ష‌, రూ.2 వేల జ‌రిమానాను విధించింది. ఈ సంద‌ర్భంగా విచార‌ణ‌కు హాజ‌రైన పాఠ‌శాల విద్యా శాఖ అధికారులు క్ష‌మాప‌ణ చెప్పినా హైకోర్టు ప‌ట్టించుకోలేదు. అయితే ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్యర్థ‌న‌తో శిక్ష అమ‌లును 2 వారాల పాటు వాయిదా వేసింది.

Leave a Reply

%d bloggers like this: