పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు ..రాహుల్ ,నడ్డా టూర్ లపై కేటీఆర్ వ్యంగ్యబాణాలు …
పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు, వెళుతుంటారు: కేటీఆర్
నడ్డా, రాహుల్ పర్యటనల నేపథ్యంలో కేటీఆర్ స్పందన
సింగిల్ లైన్‌తో కూడిన ఆసక్తికర ట్వీట్ వదిలిన మంత్రి
తెలంగాణలో నిలబడేది కేసీఆర్ మాత్రమేనంటూ వ్యాఖ్య
తెలంగాణ పర్యటనకు వస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగా సింగిల్ లైన్‌తో కూడిన ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు, వెళుతుంటారని పేర్కొన్న కేటీఆర్… కేసీఆర్ మాత్రమే తెలంగాణలో నిలబడతారంటూ ఆయన ట్వీటారు.
గురువారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర తొలి దశ ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నడ్డా హాజరయ్యారు. ఇక నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్‌లో టీపీసీసీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభకు హాజరైన రాహుల్… శనివారం నాడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నడ్దా, రాహుల్‌ల టూర్‌ల నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.