Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత!
హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి
ఆయన వయసు 73 సంవత్సరాలు
శ్రీకాళహస్తి నుంచి వరుసగా ఐదు సార్లు గెలుపొందిన బొజ్జల
చంద్రబాబు ,జగన్ ,కేసీఆర్ ల సంతాపం ….

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే హైదరాబాదులోని బొజ్జల నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బొజ్జల మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు . వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు .

ఆత్మీయుడిని కోల్పోయా!… బొజ్జ‌ల మృతిపై కేసీఆర్ సంతాపం!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి మృతిపై రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్… బొజ్జ‌ల మృతికి సంతాపం తెలుపుతూ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. స‌హచ‌రుడు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బొజ్జ‌ల కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో కేసీఆర్ అత్యంత స‌న్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేత‌ల్లో బొజ్జ‌ల కూడా ఒక‌రు. ఈ కార‌ణంగానే బొజ్జ‌ల మృతి వార్త తెలిసినంత‌నే త‌న ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు.

చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేత.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు…

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి అందరినీ షాక్ కు గురి చేస్తోంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

బొజ్జల కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయ నేపథ్యం ఉంది. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయన తిరుగులేని ఆధిపత్యాన్ని ఎన్నో ఏళ్ల పాటు కొనసాగించారు. 1949 ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ)లోని ఉరందూరులో బొజ్జల జన్మించారు. ఆయన తండ్రి సుబ్బరామిరెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా చేశారు.

1968లో సైన్స్ లో డిగ్రీ చేసిన బొజ్జల… ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 1972లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. మాజీ మంత్రి, దివంగత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కుమార్తె బృందను ఆయన పెళ్లాడారు. పెళ్లి చేసుకున్న తర్వాత న్యాయవాదిగా వృత్తిని కొనసాగించేందుకు బొజ్జల హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన… టీడీపీలో చేరారు. 1989 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు. చంద్రబాబు కేబినెట్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు అంత్యంత సన్నిహితుడిగా బొజ్జలకు పేరుంది. 2003 అక్టోబర్ 1న అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఘటన జరిగినప్పుడు కూడా చంద్రబాబుతో పాటు బొజ్జల ఉన్నారు. ఈ పేలుడులో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. బొజ్జలకు ఛాతి, భుజానికి గాయాలయ్యాయి. చంద్రబాబుకు ఛాతి, ఎడమ చేయి, ముక్కుకు గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బొజ్జల మరణం పట్ల పార్టీలకు అతీతంగా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Related posts

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన ఈ చిన్ని గిరిజన గ్రామం !

Drukpadam

భారత్‌లో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ.. అలర్టయిన అధికారులు!

Drukpadam

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్ కేసు.. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లింపు…

Drukpadam

Leave a Comment