మోడీ పాలన కొనసాగితే ప్రజలకు మరింత కష్టం ….సోనియాగాంధీ హెచ్చరిక!

మోడీ పాలన కొనసాగితే ప్రజలకు మరింత కష్టం ….సోనియాగాంధీ హెచ్చరిక!
ప్ర‌జ‌ల్లో చీలిక‌, మైనారిటీల‌పై దాడులు, ప్ర‌త్య‌ర్థుల‌పై బెదిరింపులు మోడీ విధానం
ఉద‌య్‌పూర్‌లో మొద‌లైన చింత‌న శిబిర్‌
ప్రారంభోప‌న్యాసం చేసిన సోనియా గాంధీ
మోదీ పాల‌న‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన వైనం

మోదీపాలన కొనసాగితే ప్రజలకు మరింత కష్టం అవుతుందని సోనియాగాంధీ హెచ్చరించారు .మూడురోజులపాటు కొనసాగుతున్న కాంగ్రెస్ చింతన్ బైఠక్ సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు .ఈ సందర్భంగా బీజేపీ విధానాలపై ధ్వజమెత్తారు . దేశ ప్ర‌జ‌ల్లో చీలిక తేవ‌డం, మైనారిటీల‌పై దాడులు, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను బెదిరించ‌డం త‌దిత‌ర ల‌క్ష్యాల‌తోనే బీజేపీ పాల‌న సాగుతోందని ఆమె దుయ్య‌బ‌ట్టారు.

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తున్న కీల‌క స‌మావేశంలో సోనియా గాంధీ చేసిన ఉపన్యాసానికి ప్రతినిధుల నుంచి స్పందన లభించింది. ఈ సంద‌ర్భంగా మోదీ పాలన‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే.. 2024 ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆమె పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నిత్యం చెప్పే కనిష్ఠ ప్ర‌భుత్వం గరిష్ఠ పాల‌న అన్న నినాదాన్ని సోనియా గాంధీ ప్ర‌స్తావించారు. ఈ నినాదం అర్థం ప్ర‌జ‌ల్లో చీలిక తేవ‌డం, మైనారిటీపై దాడులు చేయ‌డం, రాజ‌కీయ ప్ర‌త్యర్థుల‌ను బెదిరింపుల‌కు గురి చేయ‌డ‌మేన‌ని సోనియా గాంధీ చెప్పారు. ప్ర‌జ‌లు నిత్యం భ‌యాందోళ‌న‌ల్లో బ‌తికేలా మోదీ స‌ర్కారు పాల‌న సాగిస్తోంద‌ని ఆమె విమ‌ర్శించారు. మైనారిటీల‌ను హింసిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం గాంధీజీని హ‌త్య చేసిన వారిని మాత్రం కీర్తిస్తోంద‌ని కూడా సోనియా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మోదీ పాల‌న కార‌ణంగా దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సోనియా… ఇదే పాల‌న మ‌రింత కాలం కొన‌సాగితే.. దేశం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీని దీటుగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె పార్టీ నేత‌ల‌కు సూచించారు.

Leave a Reply

%d bloggers like this: