భారత్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన చైనా… 

భారత్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన చైనా… 

  • -గోధుమల ఎగుమతి నిలిపివేసిన భారత్
  • -జీ-7 దేశాల ఆక్షేపణ
  • -స్పందించిన చైనా
  • -భారత్ ను నిందించడం మానుకోవాలని హితవు

ఇరుగుపొరుగు దేశాలు భారత్, చైనా మధ్య ఒక్కోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం తెలిసిందే. ఎంతటి స్పర్ధలు ఉన్నప్పటికీ… చైనా ఏ విషయంలోనైనా భారత్ కు మద్దతివ్వడం అంటే అది అత్యంత అరుదైన విషయమే. ఇటీవల భారత్ ప్రపంచదేశాలకు గోధుమల ఎగుమతి నిలిపివేసింది. జాతీయ ఎగుమతుల విధానం నవీకరించిన నేపథ్యంలో, నిషేధించిన ఎగుమతుల జాబితాలో గోధుమలను కూడా చేర్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది.

అయితే, భారత్ నిర్ణయాన్ని జీ-7 దేశాలు తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, చైనా భారత్ కు దన్నుగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. భారత్ వంటి దేశాన్ని నిందిస్తే ప్రపంచ ఆహార సంక్షోభం సమసిపోతుందా? అంటూ సూటిగా ప్రశ్నించింది.

“భారత్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జీ-7 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు కోరుతున్నారు. గోధుమల ఎగుమతిపై నిషేధం ఎత్తివేయాలని అంటున్నారు. అదే సమయంలో తమ ఆహార ఎగుమతులను పెంచడం ద్వారా ప్రపంచ ఆహార విపణిని స్థిరీకరించేందుకు జీ-7 దేశాలు ఎందుకు ప్రయత్నించవు?” అంటూ చైనా నిలదీసింది.

ప్రపంచంలో అత్యధికంగా గోధుమలు పండిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, అయితే, గోధుమ ఎగుమతుల పరంగా భారత్ వాటా స్వల్పమేనని చైనా పేర్కొంది. కానీ, అంతకంటే ఎక్కువమొత్తంలో అమెరికా, కెనడా, ఈయూ దేశాలు, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు గోధుమ ఎగుమతి చేస్తున్నాయని చైనా వివరించింది.

“ప్రపంచ ఆహార సంక్షోభం ముప్పు పొంచి ఉన్న వేళ, భారత్ తన అంతర్గత ఆహార సరఫరాను కాపాడుకోవడం కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని పాశ్చాత్య దేశాలు తాము కూడా గోధుమ ఎగుమతులను తగ్గించుకుని ఉండుంటే, ఇవాళ ఆ దేశాలు భారత్ ను విమర్శించి ఉండేవి కావు” అని చైనా అభిప్రాయపడింది.

అంతేకాదు, ప్రపంచ ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు జీ-7 దేశాలు కూడా కలిసిరావాలని, భారత్ ను, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలను విమర్శించడం మానుకోవాలని చైనా హితవు పలికింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని వెలువరించింది.

Leave a Reply

%d bloggers like this: